భైరవ కోన (జానపద నవల – 2 వ భాగం ) - భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

భైరవ కోన (జానపద నవల – 2 వ భాగం ) - భావరాజు పద్మిని

Share This

( జరిగిన కధ .... భైరవకోనలోని సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు విజయుడు. అరణ్యంలోని గుహ్యమైన భైరవ- భైరవి విగ్రహాలను పూజించి, వారి అనుగ్రహం పొందమని విజయుడికి చెప్తారు, మహర్షి. భైరవ ఆరాధన విశిష్టతను గురించి విజయుడికి వివరిస్తారు మహర్షి. భైరవ మహిమను తెలుసుకున్న విజయుడిని, మహర్షి జలపాతం వద్ద ఉన్న గుహ్యమైన గుహకు తీసుకుని వెడుతూ, నీటిలో నడుస్తూ ఉండగా, దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తుందొక వికటాట్టహాసం ...)

 ముందుకు నడిచే కొద్దీ.... మరింత బిగ్గరగా వినిపించసాగింది ,వికటాట్టహాసం ..

అంతలో వికృతంగా వినిపించిందొక స్వరం ...

 ‘సదానంద మహర్షీ ! నన్ను ఎదుర్కునేందుకు విజయుడిని సిద్ధం చేస్తున్నావా ? నీ అమాయకత్వం చూస్తే, నవ్వు పుట్టుకొస్తోంది. మంత్రతంత్రయంత్ర విద్యల్లో నిష్ణాతుడిని, సంకల్ప మాత్రం చేత ప్రపంచాన్ని గడగడ లాడించగల సమర్దుడిని ! ఈ కరాళ మాంత్రికుడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అతి క్లిష్టమైన భైరవ కృప ఈ నూనూగు మీసాల యువకుడికి లభిస్తుందా? ఆలోచించు ! నేను తలచుకుంటే, ఇప్పుడే నిన్నూ, నీ శిష్యుడిని అంతం చెయ్యగలను.’

‘కరాళా ! వచ్చావా, ఎన్ని యుగాలు గడిచినా, దుష్టశక్తులు దైవశక్తి ముందు నిలవలేవు. ప్రపంచాన్ని గుప్పిట పట్టి, చక్రవర్తివి కావాలన్న నీ స్వార్ధసంకల్పం ఎన్నటికీ నెరవేరదు. నీ వంటి కరాళుళ్ళు వేలకు వేలు పుట్టి, అనేక సిద్ధులు, శక్తులు పొంది, నిత్య యౌవనులు కాగలిగారే కాని, తమకు ప్రాప్తమైన శక్తులను మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించి చరితార్ధులైనట్లు ఏ చరిత్రలోనూ లేదు. చివరికి వారంతా మట్టిగరిచారు. నీకూ అదే గతి పడుతుంది! సిద్ధంగా ఉండు !’ , పదునుగా జవాబిచ్చారు సదానందమహర్షి .

దాంతో చెలరేగిపోయిన కరాళుడు, వారు నడిచే నీటిలో మంటలు పుట్టించాడు. వెంటనే అతి శక్తివంతమైన నృసింహ మహా మంత్ర రాజ స్తోత్రాన్ని పఠించసాగారు సదానందమహర్షి ... ఆ మంత్రం ఎంతటి దుష్టశాక్తుల్నైనా క్షణాల్లో పారద్రోలుతుంది. ఆపత్కాలంలో సత్వరమే రక్షణ కల్పిస్తుంది.

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం !”

అంతే, అప్పుడు జరిగిందొక అద్భుతం ! సరిగ్గా సదానందమహర్షి , విజయుడు ఉన్న ప్రదేశానికి పైన, ఆకాశంలో సుదర్శన చక్రం  ఒక గొడుగులాగా ఏర్పడింది.  జోరుగా వాన కురిసింది, క్షణాల్లో మంటలు మాయమైపోయాయి. అంతులేని ప్రశాంతత నెలకొంది. ఆశ్చర్యంతో ఇదంతా గమనిస్తున్న విజయుడితో, “నాయనా ! తరువాత అన్నీ నీకు విశదపరుస్తాను. భైరవారాధనకు అమృత ఘడియలు మించిపోతున్నాయి. అదిగో, పూజకు కావలసిన సంభారాలు, అటు చూడు...” అంటూ నీటి ఒడ్డున ఉత్తర దిక్కుగా సూచించారు మహర్షి.

 ఆశ్చర్యం! అటుగా ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉంది. ఏనుగులు పూలమాలలు, బిల్వ పత్రాలు, సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చాయి. ఉడుతలు, కుందేళ్ళు కొన్ని పళ్ళను తీసుకు వచ్చాయి. వాటన్నింటినీ తను తెచ్చిన ఒక పెద్ద పళ్ళెరంలో చక్కగా సర్దింది ఓ వానరం. విజయుడికేసి చూసి, చెయ్యెత్తి వద్దకు రమ్మని సైగ చేసింది.

‘నాయనా, విజయా ! నా పయనం ఇంత వరకే. ఇకపై నీ చిత్తశుద్ధి, కార్యదీక్ష, భక్తి ప్రపత్తులే నీకు శ్రీరామ రక్ష !నీకు శక్తి భైరవ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను. గుహలోని భైరవ –భైరవి విగ్రహాలకు భక్తితో అర్ఘ్య పాద్యాది ఉపాచారాలతో పూజసల్పి, నైవేద్యం అర్పించి, కనులు మూసుకుని, ఈ మంత్ర జపం ఆరంభించు. నీకు ఆకలిదప్పులు కలుగకుండా ఈ మూలిక ప్రసాదిస్తున్నాను. బాహ్య చింతన వీడి, మనసు లగ్నం చేసి, ఆ దివ్య మూర్తుల్ని ఉపాసించు. ఎన్ని రోజులైనా, పట్టు వీడక, సంకల్ప బలంతో వారి కరుణ కలిగేదాకా మంత్ర జపం చెయ్యి. నీవు కారణ జన్ముడవు. ఆ భైరవ కృప నీకు తప్పక  లభిస్తుంది.

సమయం ఆసన్నమయ్యింది. ఇక బయల్దేరు, ఆ ఒడ్డున ఉన్న వానరం అందించే పళ్లెరాన్ని నెత్తిన పెట్టుకుని, మోకాలి లోతున్న ఈ నీటిలో నడుస్తూ, జలపాతం వరకూ వెళ్ళు. ఆ జలపాతం వెనుక వైపున ఉన్న గుహలోనికి ప్రవేశించు.... ఈ గురువు దీవెనలు నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి,’ అంటూ కరుణా దృక్కులతో విజయుడ్ని చూసారు సదానంద మహర్షి.

 గురుపాదుకలకు ఒంగి వందనం సమర్పించి, ఒడ్డున ఉన్న వానరం వద్దకు వెళ్ళాడు విజయుడు. అతని రాకను గమనించిన ఏనుగులు తొండం ఎత్తి ఘీంకారం చేసాయి. ఉడుతలు సందడిగా అటూ ఇటూ తిరుగుతూ కోలాహలం చెయ్యసాగాయి. కుందేళ్ళు వెనుక కాళ్ళపై నిల్చుని తమ ఆనందాన్ని తెలియచేసాయి. వానరం పిల్లిమొగ్గలు వేస్తూ విజయుడి వద్దకు చేరింది. ప్రేమగా దాని వీపు నిమిరాడు విజయుడు. ఆ స్పర్శలోని ఆత్మీయతకు పులకరించి, విజయుడి మెడను హత్తుకుని, పళ్లెరాన్ని అందుకోమన్నట్లుగా అతడికి  సైగ చేసింది వానరం. నెమ్మదిగా దాన్ని క్రిందకు దించి, ఆ పళ్లెరాన్ని అందుకుని, నెత్తిన పెట్టుకుని, పయనించసాగాడు విజయుడు. అతని మనసంతా శివమయం. శివశివానీ స్వరూపాలైన భైరవ- భైరవీ మూర్తుల కృపకు పాత్రుడవ్వాలన్న స్థిర చిత్తంతో బయలుదేరాడు.

 గుహ మార్గం చీకటిగా ఉంది. కేవలం ఒక మనిషి పట్టే సందు మాత్రమే ఉంది. గబ్బిలాలు తిరుగుతున్నాయి, సర్పాలు ప్రాకుతున్నాయి. కీచురాళ్ళు అరుస్తున్నాయి. దారికి అడ్డంగా ఉన్న బూజును ఒక చేత్తో తీసేస్తూ, నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళసాగాడు విజయుడు. పిశాచాలు అరుస్తున్నట్టు యేవో శబ్దాలు వినిపించసాగాయి. అదరక, బెదరక భైరవ మంత్రం జపిస్తూ పయనించసాగాడు విజయుడు. ఏదైనా సత్కార్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దుష్టశక్తులు ఇలా అడ్డుపడతాయని అతనికి తెలుసు. అతని మనసు ఏదో కీడును శంకించసాగింది.....

విజయుడి దారికి అడ్డంగా నిలిచింది ఓ ఒంటికన్ను పిశాచం. దాని నెత్తిన చిత్రమైన కాంతి వెలిగిఆరుతోంది. కన్ను చింత నిప్పులా మండుతోంది. అది దాని ఎర్రటి నాలుకను ,పొడుగ్గా చాచింది . దాని నోట్లో నుంచి మంటలు పుడుతున్నాయి. విజయుడిని అడ్డుకోవాలని అట్టహాసంగా అరుస్తూ, వేగంగా అతని వద్దకు రాసాగింది. మహర్షి చెప్పిన నృసింహ మహామంత్రాన్ని జపిస్తూ, ఒరలో ఉన్న బాకును గురి చూసి విసిరాడు విజయుడు. ఆ బాకు తగలగానే, మంత్ర ప్రభావం వల్ల, కాలి బూడిదయ్యింది పిశాచం.

అలా అడ్డంకులను అధిగమిస్తూ, చాలా దూరం పయనించాకా, ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది.  గుహ విశాలమయింది.  గుహ పైభాగంలో ఉన్న రంధ్రం నుంచీ సూర్య కిరణాలు గుహలోనికి ప్రసరిస్తున్నాయి. ఏదో పరిమళం విజయుడి ముక్కుపుటాలను త్రాకింది.   దగ్గరలోనే విగ్రహాలు ఉన్నాయన్న సంగతిని , ఆ పరిమళం సూచిస్తోందని గుర్తించాడు విజయుడు. ఉత్సాహంగా అడుగులు ముందుకు వేసాడు.

మరో పదడుగులు వెయ్యగానే,  అందమైన  భైరవ భైరవీ విగ్రహాలు అతడికి దర్శనం ఇచ్చాయి. బంగారు కమల పీఠం పై, దశ భుజ భైరవుడి ఒడిలో ఒద్దికగా కూర్చుంది భైరవీ మాత. ఆ విగ్రహాల ముఖాల్లో ద్యోతకమయ్యే  దివ్యత్వానికి, అక్కడి ప్రశాంతతకు ముగ్దుడవుతూ తనకు తెలియకుండానే పళ్లెరాన్ని క్రింద ఉంచి, పూజకు ఉపక్రమించాడు విజయుడు.

“ యం యం యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం

సం సం సంహార మూర్తిం శిరః మకుట జటా శేఖరం చంద్ర బింబం

దం దం దీర్ఘ కాయం వికృత నఖ ముఖం జోర్ధ్వరోమం కరాళం

పం పం పం పాప నాశం ప్రాణమత్ సతతం భైరవం క్షేత్రపాలం “

అంటూ ఆనందోత్సాహాలతో ఆరంభించి, సకల ఉపచారాలతో విగ్రహాలను పూజించి, పద్మాసనంలో ధ్యానమగ్నుడయ్యాడు విజయుడు. అతడికి ఒకటే ధ్యేయం , దుర్లభమైన భైరవ కృపను పొందాలి. సమస్త జనావళిని దుష్ట శక్తుల నుండి రక్షించాలి. తన ప్రాణ శక్తిని పూర్తిగా కేంద్రీకరించి, మహర్షి చెప్పిన మంత్రాన్ని పట్టు విడవకుండా జపించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అయినా, విజయుడు పట్టు విడవలేదు. తన దేహంపై అనేక కీటకాలు ప్రాకుతున్నా, చీమలు పుట్టలు పెడుతున్నా, లెక్కచెయ్యలేదు. అతని తపస్సు తీవ్రతకు గుహ కంపించసాగింది.

అతడి కార్యదీక్షకు, సత్సంకల్పానికి , ఏకాగ్రతకు, భక్తితత్పరతకు తలవొగ్గిన దేవతల అనుగ్రహంలా అప్పుడు జరిగిందొక అద్భుతం !

(సశేషం...)

No comments:

Post a Comment

Pages