ఉచిత వాగ్దానాలు : పెయ్యేటి శ్రీదేవి - అచ్చంగా తెలుగు

ఉచిత వాగ్దానాలు : పెయ్యేటి శ్రీదేవి

Share This
ఉచిత వాగ్దానాలు 
 పెయ్యేటి శ్రీదేవి


ఎన్నికల సమయం ఇంకా దగ్గర పడకపోయినా అన్ని పార్టీలవాళ్ళూ ముందునుంచే సన్నధ్ధమవుతున్నారు. అధికారపార్టీవాళ్ళకి ఎన్నికలొస్తున్నాయంటే ఎక్కడ ఓడిపోతామోనన్న భయం. ప్రతిపక్షపార్టీవాళ్ళకి త్వరగా ఎన్నికలొచ్చి ఈసారైనా పోయిన అధికారం చేజిక్కించచుకోవాలనే ఆరాటం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల మహాసంగ్రామానికి అన్ని పార్టీలవారూ ఏమైనా సరే, ఈ ఎన్నికల్లో గెలవాలని ఎన్ని కలలో కంటూ పార్టీనేతలందరూ వాళ్ళని వీళ్ళూ, వీళ్ళని వాళ్ళూ నిందారోపణలు చేసుకుంటూ, ఉచితంగా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎడాపెడా హద్దుల్లేని ఉచిత వాగ్దానాలు గుప్పించేస్తున్నారు. ఆ ఉచిత వాగ్దానాలు ఎవరేం చేస్తున్నారో అని విశాల రోజూ టి.వి.ఛానెళ్ళలో ఎన్నికల వార్తలు రాత్రి పొద్దుపోయేదాకా చూస్తూ పడుకుండిపోతుంది. ఆ ఉచిత వాగ్దానాలు ఎవరేం చేస్తున్నారో, ఎవరికి ఓటెయ్యాలో విశాలతో పాటు మనమూ చూసొద్దాం రండి. ***********************
 ' ఓ మహాజనులారా! మన రాష్ట్రంలో నానాటికీ అవినీతి పెరిగిపోతోంది. అన్యాయంగా ప్రజల సొమ్ము దోచుకు తింటున్నారు. ఈ గేస్ పార్టీని నమ్మకండి. ఏమైనా సరే, ఈ దుష్ట గేస్ పార్టీని ఓడించి దేశాన్ని కాపాడుకుందాం. మన బాదుషాపార్టీకే ఓటు వేసి గెలిపించండి. ఎల్.కె.జి.నించి పి.జి.దాకా ఉచితవిద్య చెప్పిస్తాము. వందరూపాయలకి నెలవారీ వంట సరుకులు ఇప్పిస్తాము.' ' జనం ! జనం! ఇసుక వేస్తే రాలనంత ప్రభంజనం!! సభ చప్పట్లతో మారుమోగిపోయింది. 
******************
 ' ఓ మహాప్రజలారా! పేదప్రజలకి ఇరవైయ్యారు గంటలు ఉచిత కరెంటు ఇస్తాం. పాపం, కూలీ నాలీ చేసుకుని ఇంటికొచ్చి హాయిగా చూడడానికి మీకు ప్లాస్మా టి.వి.లు ఇస్తాం. అందుకని మా చక్కిలంపార్టీకి ఓటు వేసి గెలిపించండి. ఈ ఒక్క అవకాశం ఇస్తే ఏభయి ఏళ్ళకల్లా పేదరికాన్ని రూపుమాపుతాం.' చక్కిలంపార్టీకి కూడా అదే జనం, జనం! కాని జనానికి అర్థం కాలేదు. రోజుకి ఇరవైనాలుగు గంటలయితే, ఇరవైయ్యారు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామంటారేమిటి? అవునులే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు ఉచిత విద్యుత్ కోసం రోజుకి ఇరైైయ్యారు గంటలుగా మారుస్తారేమో మరి!! ' ఏభై ఏళ్ళకల్లా పేదరికాన్ని రూపు మాపుతామంటున్నారు. అప్పటిదాకా మనం బతికుంటామంటావా రంగన్నా?' ఇవీ జనంలో అనుకునే మాటలు.
 ******************* 
' ఓ మహాప్రజలారా! మా రామరాజ్యం పార్టీకి ఓటు వెయ్యండి. సెల్ ఫోన్లిస్తాం. లేప్ టాప్ లిస్తాం. రామమందిరం కట్టిస్తాం.' జనం! జనం! చప్పట్లు!! జనంలో అనుకునే మాటలు, ' లేపుటాపులంట, అయేటో తెల్దు. ఇప్పటికే సెల్ ఫోన్లెలాగూ ఉన్నాయి మనకి. రామురోరి గుళ్ళు కూడా చాలానే వున్నాయి. ఆటికి ఎల్లడమే కుదరడం లేదు. ఎవరికి ఓటేయాలో తెలవటం లేదు మనకి.' 
**************** 
' ఓ నా అక్కల్లారా, చెల్లెళ్ళారా! అన్నల్లారా, తమ్ముల్లారా! మిమ్మల్నందర్నీ నా సొంత అక్క, సెల్లె, సొంత అన్న, అమ్ముల్లా సూసుకుంటా. మీకే కట్టమొచ్చినా మీకు అండగా వుంటాను. మీకు జొరమొస్తే ఉచితంగా వైద్యం సేయిత్తాన్ను. దోమల్లేకుండా నిర్మూలిస్తాను. స్కూటర్లిస్తాను. అందుకని మరిసిపోకుండా మా తొండ పార్టీకే ఓటేసి గెలిపించండి.' అక్కడా అదే జనం...........జనం! ' రంగన్నా! ఏమంటావు? దోమల్లేకుండా నిర్మూలిస్తామంటుండ్రు మరి! మా ఇంటిదీ మధ్య డెంగ్యూ వచ్చి సచ్చిపోనాది. అందుకే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. దీనికి మల్లా డెంగ్యూ వస్తే ఏ పిల్ల దొరుకుతాది? అందుకే ఈ తొండపార్టీకే ఓటేద్దామనుకుంటున్నాను.' 
********************
 ' ఓ సోదర సోదర సోదరులారా!' ' సోదరమణుల్నీ పెట్టు బావా1 మన అక్కసెల్లెళ్ళు అలిగితే ఓట్లు రాలవు.' ' ఊ, సరే, సరే. గమ్మున యాదుకి రాలా. ఓ నా ప్రియమైన సోదర సోదరీమణులారా! మేం మీకు గేసుబండలిస్తాం. అంతేగాక ఎండిగళాసులిత్తాం. కాళ్ళకి ఎండిపట్టీలిస్తాం. పెల్లి సేసుకునేటోల్లకి మంగలసూత్తరాలు మేమే సేయించి ఇత్తాం. అందుకే మా ఊసరవెల్లి పార్టీకే ఓటేసి గెలిపించండి.' ' ఊసరవెల్లి అంటే ఏటి రంగన్నా?' ' తొండ ముదిరితే ఊసరవెల్లిగా మారి రంగులు మారుత్తుంది. ఈ నాయకులూ అంతే.' ' రంగన్నా! ఎండిగలాసు మా ఇంట్లో ఒకటుంది. మా చంటాడు నేనూ ఎండిగలాసుతోనే పాలు తాగుతానని మారాం సేత్తావుంటాడు. అందుకే నేను ఈ ఎండిగలాసు ఇచ్చేటోల్లకే ఓటేత్తాను.' ' సర్లే. నువ్వెరికేస్తావ్ రంగన్నా?' ' ఉండు. ఇంకా ఎవరెవరు ఏమేమిస్తారో చూద్దాం.' అక్కడా అదే జనం! *******************
 ' ఓ మహాజనులారా! మన రాష్ట్రంలో నానాటికీ అవినీతి పెరిగిపోతోంది. అన్యాయంగా ప్రజల సొమ్ము దోచుకుతింటున్నారు. ఈ గేస్ పార్టీని నమ్మకండి. వాళ్ళు చెప్పేదంతా గేస్. పాపం మీరు నడవలేని స్థితిలో వుంటే ఎవరూ ఆదుకునే వారు లేరు. అందుకే పేదప్రజలకి ఆటోలిస్తాము. మీ ఓటు మా జాంగ్రీపార్టీకే వేసి గెలిపించండి.' మళ్ళీ అదే జనం, జనం, జనం! జనం చప్పట్లు కొట్టారు. ' రంగన్నా! ఆటోలిస్తామంటున్నారు. మరి ఈ పార్టీకే ఓటేద్దామా?' ' ఆటోలిస్తే మనకి నడపడం రాదుకదా? చూద్దాం వుండు. ఇంకా ఎవరేమిస్తారో!' ' ఓ మహాప్రజలారా! జాంగ్రీపార్టీ వాళ్ళు ఆటోలిస్తే, మీరు నడపలేరని మేము ఉచితంగా కార్లిస్తాం. మీరు కూలిపనులకి నదిచి వెళ్ళక్కర్లేదు. కార్లలో వెళ్ళండి. డ్రైవర్ని, పెట్రోలుని కూడా మేమే ఇస్తాం. మా కాజాపార్టీకి మీ ఓటేసి గెలిపించండి.' అని కాజాపార్టీవాళ్ళు కారుకూతలు కూసారు. అక్కడా జనం, జనఆం, జనం!!! చప్పట్లతో మారుమోగిపోయింది. ' రంగన్నా! కార్లిస్తామంటున్నారు. కాజాపార్టీకి ఓటేద్దామంటావా?' ఎన్నికల యుద్ధం ముగిసింది. కాజాపార్టీ నెగ్గింది. పేదలకి కార్లూ ఇచ్చింది. కారు పట్టేంత జాగా కూడా లేని పేదవాళ్ళ గుడిసెలముందు కార్లు వెలిసాయి కాజాపార్టీ అధికారంలోకి వచ్చాక. అక్కడినించి పనివాళ్ళు, కూలివాళ్ళు దర్జాగా కారుల్లో వెడుతున్నారు. ********************* 
ఉదయం పదిగంటలయినా పనమ్మాయి రాలేదని విసుక్కుంటూ, ఎలాగో వంట చేసి, భోజనం పెట్టి భర్తని ఆఫీసుకి, పిల్లలని స్కూళ్ళకి పంపి, అలిసిపోయి కాసేపు కుర్చీలో కూర్చుంది విశాల. ఇంతలో గుమ్మంలో కారు హారం విని, కారులో ఎవరొచ్చారా అనుకుంటూ, చిందర వందరగా వున్న ఇల్లు హడావిడిగా సర్దటం మొదలు పెట్టింది. తీరా కారులోంచి దిగింది ఎవరా అని చూస్తే, పనమ్మాయి రత్తమ్మ! పనిమనిషి కారులో రావడమేమిటా అని తెల్లబోయి చూస్తోంది విశాల. ' అమ్మగోరూ! ఏటల్లా ఇంతగా చూస్తుండ్రేటమ్మా? నేనేనమ్మా, రత్తమ్మని. పనికొచ్చినాను. పేదోల్లకి కొత్త గవర్నమెంటోళ్ళు కార్లిచ్చినారమ్మా. ఇకనించి పనుల్లోకి కార్లలో ఎల్లండి, పాపం, మీరు నడవలేరు అన్నారమ్మా. తొరగా పని చేసి పోతానమ్మా. ఎట్టాగూ కారుంది కదమమ్మా. అందుకని ఇంకో నలబై ఇల్లల్లో పనులొప్పుకున్నానమ్మా. పేదోల్లం. మాకెట్టా గడుస్తుందమ్మా?' అంటూ పని గబగబా రెండు నిముషాల్లో రోజూ చేసే పనిలో సగం కూడా చెయ్యకుండా ముగించేసి, ' అమ్మగోరూ! ఎల్లొత్తానమ్మా. రేపు సరిగా పదిగంటలకొత్తాను. గరం గరంగా చాయ్, నాస్తా రెడీగా వుంచండమ్మా.' అంటూ డ్రైవరుతో, ' పక్కీదిలో రెండిల్లున్నాయి. ఆడికి తోలుకుపో.' అని చెప్పి కారు వెనక సీట్లో కూచుంది రత్తమ్మ. విశాలకి నోట మాట రాలేదు. కళ్ళముందు ఏంజరుగుతోందో, పనిమనిషి ఏం మాట్లాడిందో, పనమ్మాయి కారులో రావడమేమిటో, ఏమీ అర్థం కాలేదు. భర్త ఇంటికి రాగానే, ' ఏమండీ, అర్జంటుగా కారు కొనండి. కారు లేకపోతే పనమ్మాయి ముందు నాకు చాలా చిన్నతనంగా వుంటుంది.' అంది విశాల. ' ఏమిటి విశాలా! ఉన్నట్టుండి కారు కొనమంటున్నావేమిటీ? కారు కొనేంత స్తోమత వున్న ఉద్యోగమా నాది? మనం అతి సామాన్య మధ్యతరగతి వాళ్ళం. మనకి కారేమిటీ? పైగా పనమ్మాయి ముందర చిన్నతనమంటావేమిటీ?' ' అవును. మన పనమ్మాయి కారులో వచ్చి పనిచేసి వెళ్ళింది. దానికో డ్రైవరు కూడాను. గవర్నమెంటు పేదవాళ్ళకి కారులిచ్చి, మళ్ళీ డ్రైవరుని, పెట్రోలుని కూడా ఇస్తున్నారు. అదుగో, బైటికెళ్ళి చూడండి. పనివాళ్ళు, కూలివాళ్ళు దర్జాగా కారుల్లో ఎలా పనుల్లోకి వెళుతున్నారో! పనిమినిషికి కారుండి, మనకి కారు లేకపోతే సిగ్గుగా వుంటుంది. అందుకే అర్జంటుగా కారు కొనండి.' ' ఏమిటి విశాలా? పనిమనిషేమిటి, కారులో రావడమేమిటి? ఏమైంది నీకు, ఇలా మాట్లాడుతున్నావు? కల ఏమైనా వచ్చిందా?' అని అడిగాడు భర్త మోహన్. ' అదేమిటి? పేదవాళ్ళందరికీ ఉచితంగా కార్లిస్తామని కాజాపార్టీవాళ్ళు వాగ్దానం చేస్తే అందరూ వాళ్ళకే ఓట్లేసి గెలిపించారుగా? అందుకే మన పనమ్మాయి కారులో వచ్చి పనిచేసి వెళ్ళిందండీ.' ' నీమొహం! ఇంకా ఉచితంగా విమానం ఇచ్చారన్నావు కాదు. ఇప్పుడు టైమెంతయిందనుకుంటున్నావు? అర్థరాత్రి మూడుగంటలైంది. ఉచితంగా లాప్ టాప్ లు, సెల్ ఫోన్లు ఇస్తామని ఒకళ్ళు, కలర్ టి.వి.లు, ఉచిత విద్యుత్తు ఇస్తామని మరొకళ్ళు, వందరూపాయలకే నెలవారీ సరుకులిస్తామని వేరొకళ్ళు, ఎల్.కె.జి. నించి పి.జి. దాకా ఉచిత విద్య చెప్పిస్తామని మరొకళ్ళు - ఈ వార్తలన్నీ చూసి నీకు మైండులో అదే పడిపోయి, అవే ఆలోచనలతో పడుకున్నావు. కారూ లేదు, గీరూ లేదు. కాసిని మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా పడుకో. మనం మధ్యతరగతి వాళ్ళం. ఉచితంగా మమనకి ఎవరూ ఏమీ ఇవ్వరు. పేదవాళ్ళకి ఉచితంగా అదిస్తాం, ఇదిస్తాం అని మభ్యపెట్టకపోతే వాళ్ళు గెలవలేరు. ఐదేళ్ళలో పేదరికం రూపు మాపుతాం అంటారు. మొరార్జీ దేశాయ్ నించి అందరూ ఎప్పట్నించో చెప్పే మాటలే ఇవి. అవన్నీ ఒట్టి మాటలు. పేదవాళ్ళే వాళ్ళ పెన్నిధులు. అందదుకే వాళ్ళల్లా ఉచిత వాగ్దానాలు చేస్తూవుంటారు. ఏమీ ఆలోచించక పడుకో ఇంక.' 
******************** 
తెల్లవారి ఏడుగంటలకి పనమ్మాయి రత్తమ్మ వచ్చి, ' అమ్మా, జల్దీ బాసిన్లెయ్యమ్మా. మా పిల్లగాడికి సద్దయింది. దవాకానాకు తోల్కపోవాల.' అంది. ' అదిసరే, పనిలోకి నడిచే వచ్చావా రత్తమ్మా?' అని అనుమానంగా అడిగింది విశాల. ' అదేటమ్మా, కొత్తగా అడుగుతుండ్రు? నడిచిరాక పనిలోకి కారులో వస్తమా?' అని అడిగింది రత్తమ్మ. ' ఓట్లేస్తే కాజాపార్టీ వాళ్ళు కార్లిస్తామన్నారుగా?' ' ఊర్కోండమ్మా. పొద్దుటే పరాసికాలు. కారంత జాగా కూడా లేని బెత్తెడు జాగాలో గుడిసెలేసుకుని వుంటే మాలాటోల్లకి కార్లేటమ్మా? ఆల్లు సేసే ఉచిత వాగ్దానాలు నమ్మి, బుర్ర కరాబు సేసుకోమాకండమ్మా. రేపు పనిలోకి రాను. మా ఆడబిడ్డ పురిటికని ఆస్పటల్లో చేరింది. తీరా చేరాక పైసల్ తక్కువైనాయని, ఆస్పటల్ నించి బైటికి గెంటేసినారు. ఎట్టుందో పాపం, సూసి రావాల. ఏటో అన్ని కట్టాలూ మా పేదోల్లకే.' అంటూ వెళిపోయింది రత్తమ్మ. పేపరుబాయ్ అప్పుడే పేపరు లోపలికి విసిరేసాడు. ఉదయాన్నే పేపరు చదివే అలవాటున్న విశాల పేపరు తెరిచింది. రాత్రి టి.వి.లో చూసిన ఉచితాల వార్తలే. జాంగ్రీపార్టీ వాళ్ళ పెద్ద బహిరంగసభ విజయవంతంగా ముగిసింది. కాలేజి అమ్మాయి పై యాసిడ్ దాడి. యువకుడి దారుణ హత్య. టికెట్ ఇవ్వలేదని కిరసనాయిలు పోసుకుని కార్యకర్తల హంగామా. ఒక మహిళ మెడలో గొలుసు చోరీ. ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారం. పేపరు చూస్తూ బాధ పడింది విశాల. ఉచితంగా అవి ఇస్తాము, ఇవి ఇస్తాము అని ఉచిత వాగ్దానాలు చెయ్యకపోతే, దేశంలో జరిగే దొంగతనాలు, దోపిడీలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలు, అవినీతి, అక్రమాలు - ఇవన్నీ రూపుమాపుతామని ఏఒక్క అభ్యర్థీ వాగ్దానాలు చెయ్యరేం? దేశంలో జరిగే ఈ నేరాలు, ఘోరాలు రోజూ టి.వి.ఛానెళ్ళలో చూపిస్తూనే వున్నారు. అవి చూసికూడా మన రాష్ట్రం ఏవిధంగా వుందో తెలియదా మన మంత్రులకి? మేము చాలా అభివృధ్ధి చేసాము అంటారు. పేదలకి ఇళ్ళు ఇచ్చామంటారు. కిలో రెండురూపాయలకి బియ్యం, ఉచిత విద్యుత్ ఇచ్చామంటారు. అసలు ఏదైనా ఉచితంగా ఎందుకివ్వాలి? ఎవడబ్బ సొమ్మని ఉచితంగా ఇస్తారు? మళ్ళీ ఆ భారమంతా పడేది ప్రజజలమీదే కదా? ఇంక ఎప్పుడూ ఆ ఉచితాలమీదే ఆధారపడుతూ వుంటారు. మధ్యతరగతివాళ్ళు కూడా ఏమీ కొనలేని స్థితిలో వున్నారు. ధరలు తగ్గిస్తామని ఎవరూ చెప్పరేం? ఉచితంగా కాకుండా పేదవాడికి సుఖంగా బ్రతికే ఏర్పాటు చెయ్యాలి. మనిషికి కావలిసిందది తిండి, బట్ట, గూడు. అవి కష్టపడి సంపాదించుకునే వీలు ప్రభుత్వాలు కలిపించాలి. రోగమొస్తే సరైన వైద్యం చేసే వైద్యులూ కావాలి. ఇంతలో, ' మా ఆడబిడ్డ చనిపోనాదమ్మా. డాక్టర్లు పైసలు ఇవ్వనేదని చేర్చుకోం, పొమ్మన్నారని చెప్పినాను కదమ్మా? వైద్యం జరగక చనిపోయింది. ఓపక్క నేనీ బాధలో వుండి, మా ఆడపడుచుని చూద్దాకని ఎడతా వుంటే, అదేదో జాంగ్రీయో, గీంగ్రీయో పార్టీ వోల్లొచ్చి వందరూపాయలు చేతుల్లో పెట్టి, మీ ఆడబడుచుని తరవాత చూద్దువుగానిలే, ముందర పార్టీ సభకి రా అని లారీలోకి బలవంతంగా ఎక్కించి తోలుకు పోనారమ్మా.' అంటూ ఏడుస్తూ రత్తాలు వచ్చి చెప్పింది. వైద్యులు ఇంత డబ్బుమనుషులై పోవడం చూసి బాధ పడింది విశాల. వాళ్ళలో సేవా దృక్పథం పూర్తిగా కొరవడుతోందే అనిపించింది. ఇల్లా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవి మంత్రులకి తెలియని విషయాలు కావు. వాళ్ళకి స్పందించే హృదయాలే లేవు. అందరూ సుఖశాంతులతో వున్నప్పుడే అది మంచి పరిపాలన అవుతుంది. కాని ఏ పార్టీవారిని చూసినా, వాళ్ళు సకుటుంబ సపిిివారంగా ఎన్నికలలో నిలబడి, మంత్రులు, ఎం.పి.లు అవడం, ఆ తరవాత అంకినంత మట్టుకు దేశాన్ని దోచుకు తినడం, సిగ్గు ఎగ్గు లేకుండా, ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నీచంగా ప్రవర్తించడం, ఒకవేళ పార్టీ టికెట్ రాకపోతే నిముషాల్లో మరొక పార్టీలోకి కప్పదాట్లు వెయ్యడం - ఇదా మహాత్ముడు కలు గన్న దేశంలోని దౌర్భాగ్యస్థితి? అసలీ మంత్రులకి వయోపరిమితి వుండదా? ముసలి వయసులో కూడా వాళ్ళకి పదవులు కావాలి. ఉద్యోగులకి రిటైర్మెంటు వుంటుంది. కాని మంత్రివర్యులకి రిటైర్ మెంటు వుండదు. వాళ్ళు చేసే అవినీతి, అక్రమాల గురించచeఎ వరన్నా ప్రశ్నించినా, మాముందు వాళ్ళు ఇంతకన్నా ఎక్కువగా దోచుకుతిన్నారనడం, వాళ్ళ హయాంలో ఇంతకన్నా ఎక్కువ నేరాలు, ఘోరాలలు జరిగాయని వాగడం - వీళ్ళా పాలకులు? ప్రజలకి ఎన్నుకోవాలన్నా సరైన ప్రత్యామ్నాయాలు లేవే? ఈ పరిస్థితి ఎప్పటికైనా మారేనా? ఇంతకీ మనం ఏ పార్టీకి ఓటెయ్యాలి? ఎవరు మంచివాళ్ళు? ఎవరు ఎన్నికలలో నెగ్గినా ఈ అన్యాయాలని రూపుమాపుతారా? ఈ ఆకాశాన్నంటిన ధరలను తగ్గిస్తారా? బాలికలనించి పెద్దవాళ్ళదాకా మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇవి జరగకుండా స్త్రీలకి రక్షణ కల్పించగలరా? అసలు చిత్తశుధ్ధితో మంచి పరిపాలన అందిస్తే ఉచిత వాగ్దానాలు చెయ్యకపోయినా వారికే ప్రజలు మళ్ళీ మళ్ళీ పట్టం కడతారు. ************************ 
ఎలాగైతేనేం, ఎన్నికలు ముగిసాయి. ఏ పార్టీకి సరైన మెజారిటీ రానందున సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై అసెంబ్లీ సమావేశాలలో రోజూ పోట్లాటలూ, వాదులాడుకోవడాలు మొదలై అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదాలు పడుతూ వుంటాయి. ఇంక ప్రజల సంగతెవరు పట్టించుకుంటారు? వీళ్ళా ప్రజలకి సేవ చేస్తామంటూ చెప్పుకు తిరిగే నాయకులు? దేశపరిస్థితులు మళ్ళీ యథాతథం. ఐదేళ్ళవరకూ మళ్ళీ ఈ ప్రభుత్వాన్నే భరించక తప్పదు. ****************************
 ' అమ్మగోరూ! ఇకనించీ మీరిచ్చే కాఫీ ఆ రబ్బరు గళాసుతో ఇవ్వమాకండి. ఆటితో తాగడం అంటే నాకు మా చెడ్డ చిరాకుగా వుంది. ఆ ఊసరరవెల్లి పార్టీ వోల్లిచ్చిన ఎండిగలాసు తెచ్చుకున్నాను. ఇందుట్లో పొయ్యండి.' అంది రత్తమ్మ. రత్తమ్మ కాళ్ళకున్న పట్టీలు చూసి, ' ఎంతే? బాగున్నాయి.' అంది విశాల. ' అబ్బే, కొనలేదండి. ఆ పార్టీవోల్లే ఇచ్చినారండి. అందుకే ఆ పార్టీకే ఓటేసినాను. మొన్న మా వదినకి ఆడపిల్ల పుట్టినందుకు రెండేలిచ్చినారు. ఆ బంగారుతల్లిని ఇంటికి మాలచ్చిమి పుట్టిందంటూ అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.' విశాల బాధగా అనుకుంది. ' మీ బతుకులే నయం. మా మధ్యతరగతి వాళ్ళు అధోగతిలో వున్నారు. అటు కోటీశ్వరుల్లాగూ బ్రతకలేం. కాని అబధ్ధపు హోదాలు చూపించుకుంటాం. ఇటు కిందతరగతి వాళ్ళలాగ కూలిపనులకీ వెళ్ళలేం. అక్కడ కూడా మా అబధ్ధపు హోదాలు అడ్డు వస్తూంటాయి. అటు పైకెగబ్రాక లేక, ఇటు కిందకు జారలేక ఎటు తోచని పిచ్చివాళ్ళలా చావలేక బతుకుతున్నాం, బతికుండీ చస్తున్నాం.'
 *********************** 

No comments:

Post a Comment

Pages