అప్పడుండే కొండలోన -2 (అన్నమాచార్య పొడుపు కధల కీర్తనకు వివరణ ) - అచ్చంగా తెలుగు

అప్పడుండే కొండలోన -2 (అన్నమాచార్య పొడుపు కధల కీర్తనకు వివరణ )

Share This
అన్నమయ్య పొడుపు కథల కీర్తన- అప్పడుండే కొండలోన వివరణ 
 డా. తాడేపల్లి పతంజలి


"చేయి లేనివాడు కోశే నెత్తి లేనివాడు మేశే కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా! "
చేయి లేనివాడు కోసే - • ఏదన్నా కోయాలంటే చేయి ఉండాలి. కాని చంద్రుడు చేయి లేకుండానే కోస్తాడు. కనుక ఇక్కడ చేయిలేనివాడు చంద్రుడు. ఎవరైతే విరహంలో ఉంటారో వారి గుండెలను చంద్రుడు తన కిరణాలతో కోస్తాడు. కాళ్ళు లేనివాడు నడచే ఓ వేంకటేశా - • కాళ్లు లేనివాడు అంటే గాలి, మనస్సు ఇలా చాలా వస్తాయి కాని ఇక్కడ కాలమని చెప్పుకొంటే సముచితంగా ఉంటుందని స్వీయ భావన. • కాలమంటే సమయమని సామాన్యార్థం. పరమాత్మ, యముడు, మృత్యువు, మేఘమనే తుష్టి, ఒకానొక ద్రవ్యం అనేవి ఇతర అర్థాలు. • కాలం నడుస్తుంటుందని లోకంలో చాల ప్రసిద్ధమైన వాక్యము. • శివపురాణం వాయవీయ సంహితలో ఏడో అధ్యాయంలో వాయుదేవుడు మునులకు కాలమాహాత్మ్యము చెప్పాడు. ఆ పరమేశ్వరుడి శక్తి అంశంలోని ఒక అంశం నిప్పులను కక్కే ఇనుపముక్కలా ఆయన ఉండి బయటకు వచ్చి గొప్పదైన కాలపురుషరూపంగా సంక్రమించింది. జరగవలసిన దానిని నిర్ణయించేది కాలమేనని మనసులో గట్టిగా నమ్మిన వ్యక్తి తన జీవితంలో ఏ ఒడిదుడుకులు సంభవించినా అవి కాలప్రభావంగానే జరిగాయని భావించాలి . అప్పుడే బాధ పడకుండా శాంతిని పొందుతుంటాడు. • కాలోహి జగద్భక్షకః’ అని ఆదిశంకరులవారు చెప్పారు. • భగవద్గీతలో గీతాచార్యుడు 'కాలః కలయతామహం' అంటాడు. (నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను). • వ్యాసభగవానుడు దేవీ భాగవతం లో 'కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయో:! నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగతః!!’ అన్నారు. (చేసిన పాపాలు, పుణ్యాలు అనుభవము చేతనే పోతాయి. ఈ విషయంలో మానవులు స్వతంత్రులు కారు).

 • గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు (యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః) అని హనుమంతుని చేత వాల్మీకి అనిపించారు. నెత్తిలేని వాడు మేశే - • నెత్తి అంటే తల. నెత్తి లేనివాడు - రామాయణంలో కబంధుడు అనే రాక్షసుడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతమ్మను వెతుక్కొంటూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్నకబంధుడనే ఒక రాక్షసుడు వాళ్లను తినబోయాడు. అతని ముఖం పొట్టలో ఉంటుంది. (సర్గ 69-27 వ శ్లోకం. కబంధ హస్తాలు అనే జాతీయం ఇతనివల్లనే ఏర్పడింది. పెదవిలేనివాడు చిలుక తినెరా - • పెదవిలేనివానిగా శుకుని ఇక్కడ ప్రతీకాత్మకంగా స్వీకరించవచ్చు. ఎందుకంటే అతని మోము చిలుక రూపంలో ఉంటుంది. చిలుకకు పెదవి అప్రసిద్ధం. • కనుక ఇక్కడ శుక మహర్షిని స్వీకరించటం జరిగింది. భాగవతం చిలుక. తినటమంటే ఇక్కడ సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం. • పరీక్షిత్తుకు శుకుడు భాగవతాన్ని ఏడు రోజుల్లో బోధించిన విషయం ప్రసిద్ధం. 

"గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే - కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా!"
 సరిగ్గా ఇటువంటిదే ఒక పొడుపు కథ మనకు కనిపిస్తుంది. పల్లాన పండింది/మెరకన ఎండింది/వాడి కుప్ప కాలింది/వాడి అప్పు తీరింది దీని జవాబు ఈ చిత్రాలలో ఉంది అన్నమయ్య పొడుపు కథకు జవాబు కూడా అదే. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే - కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా గుంట ఎండింది= కుండ తయారు చేసే గుంట ఎండింది. పండు పండింది= కుండ తయారయింది పండు కోసి కుప్ప వేసె= ఆ కుండను బయటికి తీసి మిగతా కుండలతో కలిపి కుమ్మరి వామిలో కాల్చటానికి కుప్పగా వేసాడు కుప్పకాలి యప్పు తీరేరా= ఆ కుండలు కాచే వామి కాలి, ఆకుమ్మరి వాని అప్పు తీరిందని భావం. విశేషాలు 1. పెండ్లి సమయములలో ఉపయోగించు పెద్దకుండలను రంగులతో చిత్రిస్తారు. వీటి మూతిపైన శుభసమయంలో దీపారాధన చేస్తారు. వీటినే అరివేణి(అరివేడి) కుండలు అంటారు. 2. చనిపోయిన తర్వాత కుండల అవసరం చాలా ఉంటుంది. 3. ఆకాశము అన్ని చోట్లా ఉంటుంది. కాని ఏ మలినము ఆకాశానికి అంటదు. అలాగే కుండ ఉన్నా పగిలినా అందులో ఆకాశం ఉంటుంది. కుండ ఉన్నంత కాలం దాన్ని ఘటాకాశం అంటారు. అజ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే, భ్రాంతి అంత ఎక్కువగా ఉంటుంది. ఈ భ్రాంతి వలననే మరణం అంటే భయం. ఘటాకాశం (జీవుడు) మహాకాశంలో (దేవుడు) కలిసిపోతుంది. ఒక వ్యక్తికి దహన సంస్కారాలు చేసే టప్పుడు, ఈ జీవన సత్యాన్ని చెప్పటానికి కుండని పగలకొడతారు. అంటే భ్రాంతులు అశాశ్వతమని, దృష్టి దేవుని మీద నిలపాలని ఈ పొడుపు కథ ద్వారా అన్నమయ్య బోధ. 

"సందెకాడ తలవ్రాలు సంధి దీరి వేంకటరాయ - తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ భావము - ఓ వేంకటేశా!"
 సాయంత్రం పూట అక్షరం మీద తలకట్టులా ఉండే చందమామ తెల్లవారిన తరువాత ఛాయలా మారి, ఎండలో కనబడకుండా పోతాడు. విశేషాలు చందమామ గురించి బసవరాజు అప్పారావుగారి ఈ గీతం చాలా మనోహరంగా ఉంటుంది. తెల్లమబ్బు గుఱ్ఱము నెక్కి తేజరిల్లి స్వారిజేయుచు బోవు నో చందమామ! యేల నీ కంతగర్వము? ఎల్లకాల మొక్కతీరుగ సంపద లుండునోయి? పండువెన్నెల జగమెల్ల బర్వజేసి అందరిమనంబులన్‌ గొని హాయి ముంచి, ఎల్లలోకాలకును రాజు నేనె యంచు కుల్కుచుందువుగా వెఱ్ఱిగొల్లవోలె కష్టసుఖ మెఱుగని పసికందుబిడ్డ చందమున గంతులేసెదు చందమామ! కాలపరిపాకమున నీకు గల్గబోవు గతి దలంపుము నిశ్చలమతిని సుంత! అంధకార మలీమసం బౌచు జగతి ప్రళయకాలమహాబ్ధి నిర్మగ్న యట్ల చూడ దుర్బేధ్య మౌనప్పు డేడ బోవు నీదు రాచఱికంబు వెన్నెలయు, చంద్ర! కష్టభాగ్యుడనౌ నన్ను గాంచి మంద హాసమున పరిహసించెద వౌర, చెలియ చెంత లేదనియేన? నీవింత యొడలు మరచి నన్నిట్లు మతిమాలి పరిహసింతు? పలవ! పోపొమ్ము నీతోడ వాదులేల? చలువ తిన్నియపై ముద్దు చెలియమోము మోహపారవశ్యంబున ముద్దు గొంచు బుద్ధి జెప్పింతు పొమ్ము నీ పొగరడంగ. ఇందులో ఎల్లకాలము సంపదలు ఒక్కరకంగా ఉండవనే సందేశం ఉంది. అన్నమయ్య పై పొడుపు కథలో చెప్పిన సందేశం కూడా ఇదే. 2. సందెకాడ బుట్టినట్టి - చాయల పంట యెంత చందమాయ చూడరమ్మ - చందమామ పంట అని ఇంకొక కీర్తనలో కూడా అన్నమయ్య చందమామని సంధ్యా సమయంలో పుట్టిన పంటగా చెప్పాడు. 3. చందమామ రావో జాబిల్లి రావో మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో- (ఈ పాట అర్థ తాత్పర్య విశేషాలు ఈ లింక్ లో ఉన్నాయి.http://tadepallipatanjali.hpage.in/11chandamamaravo_99234551.html) 

"ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ - ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!"
 ఈ పొడుపు కథకు విడుపు కొబ్బరికాయ సంస్కృతంలో కొబ్బరికాయను నాళికేరము లేదా నారికేళము అంటారు. నాళ్యా కముదకమీరయతీతి నాళి కేరః - రంధ్రములచేత నీటిని పీలుస్తుంది కనుక దీనికి నాళికేరమని పేరు వచ్చిందని అమర నిఘంటువు చెబుతుంది. కొబ్బరికాయ లోని ఈ రంధ్రాలనే అన్నమయ్య ‘ముత్యాల పందిరి’ అన్నాడు. మూడు రంధ్రాలను(కళ్లను) ‘ముగ్గురు వేంచేసి రాగా ‘అని పేర్కొన్నాడు.కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి కాయను ముక్కంటి అను పేరు మీద పిలవటం ఈనాటికి ఉంది. దానినే ‘ముక్కంటి దేవుని జూచేరు’ అని కవి పేర్కొన్నాడు. విశేషాలు 1. ఇప్పుడంటే మానేసారు కాని ముత్యాలపందిరి పదబంధం ఇదివరకటి జానపద పాటల్లో చాలా ఎక్కువ వాడుకలో ఉంది. ఉదా. ముత్యాల పందిరి కిందికి మన్మథుని ఆహ్వానిస్తూ ఈ పాట... జొన్నగింజ ఎడారమాయె-జోగులు జొంపులు తడాకులాయె మురుసు కుంట రావోయి కామన్న- నా ముత్యాల పందిరి కిందంగ ముద్దుగ రావోయి కామన్న నా - ముత్యాల పందిరి కిందికి సద్దగింజ ఎడారమాయె-సన్నజాజులు తడకులాయె మురుసుకుంట రావోయి కామన్న- నా ముత్యాల పందిరి కిందంగ ముద్దుగ రావోయి కామన్న- నా ముత్యాల పందిరి కిందికి...’’ అన్నమయ్య సమాజంలో తిరిగి సమాజాన్ని తన కీర్తనల్లో ప్రతిబింబించినవాడు కనుక ప్రజల నోళ్లలో నానే ముత్యాల పందిరి పదబంధానికి తన గీతంలో చోటు కల్పించాడు. 2.’తిరువీధుల మెరసీ’ కీర్తనలో కూడా ''మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద"అని ముత్యాల పందిరిని స్మరించాడు. 3. కొబ్బరికాయ మూడు కన్నుల్లో కుడిభాగాన్ని సూర్యనాడిగా, ఎడమ భాగాన్ని చంద్రనాడిగా, రెండు కన్నులకు మధ్యలో ఉన్న పెద్ద కన్నును బ్రహ్మనాడిగా చెబుతారు. పీచు ఈ మూడు నాడులకు సమన్వయం కలిగిస్తుంది. పీచు తీసేస్తే అసలైన మోక్ష జ్ఞానం కలుగుతుంది. అందుకే స్వామికి నివేదించిన తర్వాతే కొబ్బరి పీచును తీసేయాలంటారు. స్వామిని అర్చించకుండా మోక్షం రాదు కదా ! 4. భాషా శాస్త్ర వేత్తలు టెంకాయ ముందు రూపము తెంకాయ అని చెబుతారు. తెన్ అంటే దక్షిణము, అక్కడ ఎక్కువగా దొరికే కాయ కనుక తెంకాయ అని పేరు వచ్చిందట. 5. ఆజగామ యదాలక్ష్మీ ర్నారికేళ ఫలాంబువత్ నిర్జగామ యదాలక్ష్మీ ర్గజభుక్త కపిత్థవత్ అను సంస్కృత శ్లోకానికి ''సిరి దావచ్చిన వచ్చును" అని సుమతీ శతకకారుని అనువాదం ప్రసిద్ధం. 6.కొబ్బరికాయతో కొన్ని న్యాయాలు, సామెతలు ప్రసిద్ధాలు. ఉదా. (అ).కొబ్బరిచెట్టు ఎందుకెక్కినావని ప్రశ్నిస్తే దూడ గడ్డికోసమని అన్నట్లు (ఆ.) కొబ్బరికాయలోనికి నీరు ఏవిధంగా వచ్చిందో తెలియనట్లు. [ బ్రహ్మమునుండి ఈ ప్రపంచం ఎలా వస్తుందో తెలియదు.] ఈవిధంగా విశిష్టమైన కొబ్బరికాయను అక్షరాల ముత్యాల పందిరిలో అన్నమయ్య ప్రతిష్ఠించాడు. 

"ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె - దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా!"
 ఈ పొడుపు కథకు విడుపు చ్యవన మహర్షి ఇతివృత్తం. మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోని ద్వితీయా శ్వాసములో భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. చ్యవన మహర్షి గంగా యమున కలిసిన చోట నీళ్లలో మునిగి తపస్సు చేస్తున్నాడు. జాలరులు చేపల కోసం ఆ నీటిలో వలలో వేసారు (ఏటిలోన వల వేసె). చేపలతో పాటు ఆ ముని కూడా వలలో పడ్డాడు (తాటిమాను నీడలాయె= తాటి మాను నీడ అంటే అతి స్వల్పం. చ్యవన మహర్షి అతిస్వల్పమైన ప్రయత్నంతో వలలో కి వచ్చాడని భావం). వలలో మహర్షిని చూసి భయంతో వణికి పోయిన జాలరులు తమ తప్పును క్షమించమని ఆయనను వేడుకొంటారు. వాళ్లను ఆ మహర్షి నిందించలేదు. నిందలకు మహర్షుల జీవితంలో చోటు లేదు. (దూరపోతే చోటులేదురా) దూరు అంటే నిందించు, చొచ్చు, ప్రవేశించు.ఇలా అర్థాలున్నాయి. ఇందులో మొదటి అర్థం ఇక్కడ స్వీకరించబడింది) విశేషాలు చేపలతో పాటు ఆ ముని కూడా వలలో పడ్డాడు. (తాటిమాను నీడలాయె= తాటి మాను నీడ అంటే అతి స్వల్పం. చ్యవన మహర్షి అతిస్వల్పమైన ప్రయత్నంతో వలలో కి వచ్చాడని భావం) “ఇందువల్లనేమిగద్దు ‘అను శృంగార కీర్తనలో (2-268) తతి విరహపుకాక తాటిమాని నీడ అంటాడు అన్నమయ్య. ప్రేయసీ ప్రియుల మధ్య విరహపు వేడి తక్కువగా ఉందని చెప్పటానికి తాటిమాని నీడ అన్నాడు అన్నమయ్య.

No comments:

Post a Comment

Pages