సీతాపహరణం : బి.వి. రమణారావు కధలు - అచ్చంగా తెలుగు

సీతాపహరణం : బి.వి. రమణారావు కధలు

Share This
సీతాపహరణం 
బి.వి. రమణారావు కధలు 



సీత రైల్వేస్టేషన్‍కి ఆ రాత్రి వెళ్ళాలనుకోవడానికి తగినంత కారణం లేకపోలేదు. ఏడాదయింది భర్త రాజారావుకి ఐ.పి.యస్. సెలక్షనొచ్చి ఆర్నెల్లయింది తనకీ రాజారావుకీ పెళ్ళై. పోలీసాఫీసరుగా ఈ ఊరు బదిలీ అయ్యి అయిదు నెలలైంది. నాలుగు నెలలక్రితం వాళ్ళీ ఊర్లో కాపురం పెట్టుకున్నారు. తనకిప్పుడు మూడోనెల. రెండు నెలల క్రితం స్పెషల్ ట్రయినింగ్‍కి రాజారావు బెంగుళూరెళ్ళేడు. అతను తిరిగొస్తాడని నెల్లాళ్ళనుంచి వారాలు రోజులు లెక్క పెడుతోంది. ఎట్టకేలకు ఆ శుభదినం ఈనాడొచ్చింది. ఉదయంనుంచీ నెలలు నిండిన గర్భిణీ స్త్రీలాగ గడియారం మహాభారంగా నడుస్తోంది. సాయంత్రం అది ఆగిపోయిందేమోనన్న అనుమానంతో రెండుసార్లు చెవి దగ్గర పెట్టుకుచూసింది. రెండు గంటల క్రితం నాలుగైంది ఇప్పుడింకా నాలుగున్నరేమిటి చెప్మా అని పక్కింటి హనుమాయమ్మగార్ని మళ్ళీ టైమడిగింది. పరిస్థితిని గ్రహించిన ఆ యిల్లాలు, “చూడు సీతా! నా మాట విని చన్నీళ్ళ స్నానం చేసి కాస్తంత అలా దేవాలయానికి వెళ్ళి అక్కణ్ణుంచి రైలుస్టేషను కెళ్ళమ్మా!” అని సలహా ఇచ్చింది. స్టేషను కెళ్ళి ఫ్లాట్‍ఫారం మీద కొచ్చేటప్పటికి రైలొచ్చి ఆగివుందేమో ఒకటే కోలాహలం. ఆలస్యంగా వచ్చినందుకు తనకు తాను, సలహా ఇచ్చినందుకు హనుమాయమ్మగార్ని తిట్టుకుని భర్తాన్వేషణకు ఉపక్రమించింది. తను ముందు వచ్చినట్లయితే ఫ్లాట్‍ఫారం చివర నిలబడి అన్ని కంపార్ట్‍మెంట్లూ చూడగలిగేది. ఇంకా బోలెడు టైముందనుకుంది. ఛీఛీ దిక్కుమాలిన రైలూ దిక్కుమాలిన గడియారం అని విసుక్కుంటుంటే ఓ పోలీసు కానిస్టేబుల్ ఆవిణ్నానవాలు పట్టి, ఓ శాల్యూట్ కొట్టి “అమ్మా! నమస్కారం. తమరేమిటిలా వొచ్చేరు. బంధువులెవరైనా వస్తున్నారా?” అని అడిగేడు. రాజారావు తనని శ్రమపడి స్టేషన్‍కి రాత్రిపూట రావద్దనీ, దిగీదిగగానే వాయువేగ మనోవేగాలతో ఎగిరొచ్చి తన బాహువల్లరిలో వాల్తాననీ రాశాడు. కాని, తను అతన్ని సర్ప్రయిజ్‍చేసి ఆనందంతో ఉక్కిబిక్కిరి చెయ్యాలన్న సత్సంకల్పంతో ఎవరి సహాయం అర్థించకుండా, పోలీసు సిబ్బందితోకూడా చెప్పకుండా బయర్దేరొచ్చింది. రామేశ్వరం పోయినా శానేశ్వరం అప్పలేదన్నట్లు ఈ పోలీసు జవానెదురయ్యాడు. సరే, అదీ ఒకందుకు మంచిదే అని సంతోషించి, “అయ్యగా రొస్తున్నారు తెలీదా? నువ్వు ఆ వైపు వెళ్ళి చూడు, నేను ఈ వైపు చూస్తాను” అంది. “అది బెంగుళూరు వెళ్ళే బండండి. రావడం లేటయిందండి” అన్నాడతను. సీతకి చచ్చేటంత సిగ్గేసింది. చదువుకుంది, పోలీసాఫీసర్ భార్య, బోలెడు డిటెక్టివ్ నవలలూ, సాహసగాథలూ చదివింది. ఫ్లాట్‍ఫారంమీద నిలబడ్డ రైలుకి యింజనెటువైపు నున్నదీ కూడా గమనించకుండా తనకీ కంగారేమిటి? “నువ్వేమిటి ఇలా వచ్చావు?” అని అడిగింది, కాస్త ధోరణి మారుద్దామని. “యస్సై గారి సుట్టాలు బెంగుళూరెడతావుంటే రైలెక్కించడాని కొచ్చేనండి” అన్నాడు సవినయంగా. “బెంగుళూరు నుండి వొచ్చే రైలుక్కూడా టైమవ్వసోందే” అంది. ఈ రైలిప్పట్లో కదిలే సూచనలేమీ కనబడాక. “ఇదిప్పుడప్పుడే ఎళ్ళదటండి, అటునుంచొచ్చే రైలు లేటండి,. అదొచ్చేక కాని, యిది బయల్దేరదండి!” “ఎంత లేటు?” ఇందాక యస్సైగారు ఫోన్ చేస్తే గంటో గంటన్నరో పడద్దన్నారండి. ఆరింటికెళ్ళి భోజనం చేసుకొత్తానన్నారండి!” భోజనం చేసిరాకపోతే ఓ కునుకు తీసొస్తాడు. వాడికి కంగారేముందీ? అసలు తను కూడా రైల్వే ఎంక్వయిరీస్‍కి ఫోన్‍చేసి ఆ రైలెప్పుడు వేంచేస్తుందో కనుక్కుని రావల్సింది. తనకున్న ఆత్రత రైలుకెందుకుంటుందీ అన్న ఆలోచన కలగలేదు. అవసరమైనప్పుడు తప్ప రైళ్ళెప్పుడూ టైంకే వస్తాయి. “రైలు గుంతకల్లేనా వచ్చిందా లేదా?” అని అడిగింది. ఉపవాసం జాగరణల తోటి భర్తను గురించి తపస్సు చేస్తూ ఉండగా ఈ రాత్రి శివరాత్రి అవుతుందేమోనని. “రైలు బయల్దేరితే పావుగంటలో వచ్చేస్తాదండి. దోణాశలం దాటాక పది మైళొచ్చేతలికి రైలు పట్టాలు తప్పిందంటండి” చావుకబురు చల్లగా చెప్పేడన్న సామెత జ్ఞాపకమొచ్చి ఎంక్వయిరీ ఆఫీసుకేసి పరిగెత్తింది. ఎంక్వయిరీ అసిస్టెంటు రిసీవర్ ఫోన్ మీద పెట్టేస్తూ సీతకేసి చూసి “యస్ ప్లీజ్?” అన్నాడు. “ఎక్కడ డిరెయిలయ్యిందండీ?” అని అడిగింది. “ఇక్కడికి పదిమైళ్ళ దూరంలో… “అంటూ ఇంతలో గొణుగుతున్న టెలిఫోను రిసీవరెత్తి “ఎంక్వయిరీస్.. ఓరి నువ్వట్రా! అప్పుడే ఎక్కడ? ఎయిటీ ఫైవ్ అప్ కాఫీ ఫలహారాలు సేవిస్తుంది. ఎయిటీ సిక్స్ డౌన్‍కి స్వాగతం చెప్పాక దీనికి వీడ్కోలు.. ఫైవ్ టెన్నా టెన్ ట్వంటీయా.. సిండికేటా! బోర్.. ఎస్ యమ్‍గాడీలా వొస్తే ఎనౌన్సర్ కృష్ణగాణ్ణిక్కడ కూర్చోబెట్టి కొట్టుకొచ్చేస్తాను. రైట్.. ఏంకావాలమ్మా?” “డిరెయిల్ అంటున్నారు.. ఏమయినా ప్రమాదం జరిగిందాండీ?” అది బిక్కుబిక్కుమంటూ “డిరెయిలయింది గూడ్సింజనండీ ఈ పాటికి లైన్ క్లియరయిపోయుంటుంది.” ట్రెయిన్ ఓ అరగంటలో వచ్చేస్తుందంటారా?” “అరగంటా.. మహా అయితే ఓ గంట. వెయిటింగ్ రూంలో కూర్చోండి” అని సలహా ఇచ్చాడు. వొచ్చే పురుడూ, రైలూ రాకుండా పోవు. వస్తే అరగంటా లేకపోతే గంటా అంతే – అయితే మగపిల్లాడు లేకపోతే ఆడిపిల్లా అన్న జోస్యం అవకతవకగా అనిపించింది. పరిస్థితి అలాంటిది. గత్యంతరం లేక బుక్‍స్టాల్ కెళ్ళి స్టేన్లీ గార్డెనర్ నవలొకటి కొనుక్కుని వెయిటింగ్‍రూంలో కూర్చొని నాలుగైదు పేజీలు యాంత్రికంగ చదివింది. రైపు సస్పెన్స్‍తోపాటు నవల సస్పెన్సు కూడా పొడిగించుకోట మెందుకని ఆఖరి నలభైఎనిమిది పేజీలు, అంటే కోర్టు సీనుతో మొదలెట్టి చదివిపారేసింది. గడియారం చూసింది. గంటయినా రైలు జాడలేదు. ఎంక్వయిరీ అసిస్టెంటు మొహం తగలేద్దామని అటు వెళ్ళింది. వాడూ ఫైవ్ టెన్నుకో, టెన్ ట్వంటీకో పోయుంటాడు. వాడి స్థానే మరో ఘటం అవతరించేడు. ఒక్కక్షణం రిసీవర్ నోరు మూసి సీతకేసి తిరిగి “ఎస్?” అన్నాడు. అంతలోనే “బెంగుళూరునుండి వచ్చే ఎక్స్‍ప్రెస్ మరో గంటలో రెండో నంబరు ఫ్లాట్‍ఫారం మీదకు వొచ్చును. బెంగుళూర్ సే ఆనేవాలీ ఎక్స్‍ప్రెస్..” అన్న ప్రకటన విని ఆ యేస్ గాడి ఫేస్ చూసి ముఖం చిట్లించుకుని రైల్వే సంస్థని అష్టోత్తర నామావళితో స్తుతిస్తూ చల్లగాలికోసం స్టేషన్ బయటకొచ్చింది. రిక్షా, ఆటో, టాక్సీవాళ్ళు పోర్టర్లూ గుంపులు గుంపులుగా కూర్చొని తీరుబడీగా బీడీలు సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. భుజాన్ని వేళ్ళాడే వేనిటీ బేగ్ ఎడంచేత్తో పట్టుకుని తెరిచి, కుడీచేతిలో ఉన్న స్టేన్లీ గార్డనర్ నవల అమ్డులో పెడుతుండగా, ఇందాక కనబడ్డ కానిస్టేబుల్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. “తమరు ఎంతసేపని కూర్చుంటారమ్మా? పదండి, యింటీకాడ దిగబెడతాను. టాక్సీ తీసుకొస్తాను” అంటూ రెండడుగులువేసేలోగా వొద్దువొద్దని ఆమె అనడం, వాయువేగంతో ఓ ఎంబాసిడర్ కారొచ్చి కళ్ళు చీకట్లు కమ్మేలాగ హెడ్‍లైట్ల కాంతి ఆమె మొహం మీద పడటం క్షణంలో జరిగిపోయింది. కారాగింది. హెడ్‍లైట్లు ఆన్ చేసే ఉన్నాయి. డ్రైవర్ కారు దిగొచ్చి “తమకోసమే కారొచ్చింది!” అన్నాడు. “నాకోసమా?” అంటూ ఇంకిక్కడ తర్కించడం బాగుండదనీ. పైగా డ్రైవర్ మారుమాటాడకుండా తిరిగెళ్ళి మళ్ళా డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం వల్లా కళ్ళలో సూదుల్లా గుచ్చుకుంటున్న హెడ్‍లైట్లు వెలుగులో, పోలీసాఫీసర్ భార్య సీత ఠీవిగా కారువైపు నడిచింది. ఎడికె 5445 ఎవరి కారు చెప్మా అనుకుని “ఎవరు పంపేరు కారు?” అంటూ కలర్ గ్లాసెస్ పైకెత్తి ఉన్న వెనక సీటు డోర్ హేండిల్ రిలీజ్ చెయ్యడంతో డోరు తెరుచుకుంది. బలమైన రెండు చేతులు, తలవొంచి లోపలికి ఎక్కుతున్న సీత రెండు భుజాలూ పట్టుకుని లోపలకి లాగ్గానే డ్రైవర్ కారు స్టార్ట్ చేసి వెనక డోరు కుడిచేత్తో వేసెయ్యడం ఒక్కసారి జరిగేయి. ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన సీత ఆ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి మోకాళ్లమీద అడ్డంగా బోర్లాపడింది. అతను ఆమె రెండుచేతులూ వెనక్కి లాగి ఆమె భుజాన్ని వేళ్ళాడుతున్న వేనిటీబేగ్ బెల్టుతో రెండుచేతులూ కట్టిముడివేస్తూ, భయంకరమైన బొంగురు గొంతులో “నేసెప్పినట్టు సేసేవా నీకే ఆపదా ఉండదు. నాక్కావల్సింది నువ్వు కాదు – నీ పెనిమిటి రాజారావు. రెండుమాసాల కిందట ఖూనీ కేసులో ఇరుక్కున్న గంగరాజు మావోడూ. నీక్కావల్సిన డబ్బుచ్చుకో, ఆడికి జామీనిప్పించవయ్యా అంటే ఈల్లేదు పొమ్మన్నాడు. ఇప్పుడు రెండు మాసాల ట్రెయినింగయి వస్తున్నాడు గందా, నిన్నడ్డం పెట్టుగుంటే.. నారాజా! ఎన్ని జామీన్లయినా సంతగాలెడతాడు,” అంటూ జేబురుమ్మాలు తీసి దానితో సీత కళ్ళకి గంటలు కట్టి ఆమెను సీట్లో కూలేసి నడుంచుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకు పట్టుగున్నాడు. కారు నడుస్తుండగా సీత కాలుతో డోర్ హేండిల్ రిలీజ్ చెయ్యబోయింది. కాని, కాలు డోర్ హేండిల్ వరకూ వెళ్ళకుండానే నడుం మీదనుంచి చేతిని ఆమె తొడవైపు కుదించి అదిమిపట్టేడు. ఓ వైపు భయం ఆందోళన కృంగదీస్తున్నాయి. తన దేహబలాన్నీ బుద్ధిబలాన్నీ ధైర్యాన్నీ ఎన్నోసార్లు ప్రదర్శించి భర్తమెప్పు పొందిన అహం ఓవైపున పొంగిపొర్లుతుంది. మరోనిమిషంలో కారు ఎడమవైపుకు మళ్లింది. కారు ఎక్కడికెడుతున్నదీ మనస్సులోనే గుర్తుపెట్టుకునే ప్రయత్నం ప్రారంభించాలన్న ఉద్దేశంతో సీటులో వొరుగుతూ సొమ్మసిల్లినట్టు మూలకి జారగిలబడింది. సుమారు నూరు అంకెలు ఒకస్థాయిలో లెక్కబెట్టడానికో నిమిషం పడుతుందని అంచనా వేసుకుని అంకెలు లెక్కబెట్టడం మొదలెట్టింది. ఆ లెక్కని మళ్లీ నాలుగున్నర నిమిషాలకి కుడివైపుకు మళ్లింది. మళ్లీ నిమిషంలోపలే కుడివైపుకి మళ్లింది. తర్వాత స్ట్రెయిట్ రోడ్ లాగుంది. ఏడు నిమిషాలు పట్టింది. కారు స్లో డౌనయింది. ఎడమవైపు తిరిగి ఆగింది. ‘ఉన్’ ‘ఉస్’ అంటూ నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞలు జరుగుతుండగా కారు డోర్ తెరుచుకుంది. ఆ దుర్మార్గుడు కారుదిగి సభ్యతా సంకోచం లేకుండా ఆమెను తన శరీరానికి అదిమి పట్టుకుని సీట్లోంచి లాగి భుజం మీద వేసుకున్నాడు. వన్, టూ, త్రీ, ఫోర్, నాలుగు మెట్లెక్కాడు. పన్నెండడుగులు వేసి కుడివైపునున్న గది గడియ తీసి తలుపులు కాళ్ళతో తన్ని లోపలకి నాలుగడుగులు వేసి ఆమెని భుజంమీంచి చేతులమీదకి యెత్తుకుని ఫోమ్‍బెడ్ మీద పడేసేడు. “ఇదిగో బుల్లెమ్మా! ఇది సౌండ్ ఫ్రూఫ్ గది. అంటే నువ్విప్పుడర్సి చచ్చినా బయిటోళ్ళకినపడి సావదు. బుద్ధిమంతితనంగా వుంటే ఈడ నీకే కొరతా ఉండదు. ఓ అరగంట రెస్టుచ్చుకో, మళ్ళీ వత్తా” అంటూ ఆ రాక్షసుడు హెచ్చరించి తలుపేసుకుపోయేడు. అయిపోయింది తను కనే కలలన్నీ కరిగిపోయాయి. తన జీవితం కొద్ది క్షణాల్లో సర్వనాశనం కాబోతోంది. భయం ఆందోళన నిస్సహాయత ఆమె మనస్సును మేఘాల్లాగ ఆక్రమించుకున్నాయి. తను ఏం చేయాలి? ఏం చేయగలదు? అరగంటలో వస్తాడు. ఈ అరగంటలో తనెలాగ ఈ పాపకూపంలోంచి బయటపడాలి? తనకింక భగవంతుడే దిక్కు అనుకుంటూ నిస్సహాయంగా పరుపుమీద అటూ ఇటూ దొర్లింది. చటుక్కున తన కాలికి తగిలి కదిలి చప్పుడు చేసింది, తనకి చిరపరిచితమైన వస్తువు – టెలీఫోను – సందేహం లేదు. దాన్ని ఉపయోగించుకోవడం ఎలాగ? తన చేతులు తన వెనక్కాల తన హేడ్ బేగ్ బెల్టుతో కట్టేసి వున్నాయి. కొద్దిగా వొదులుచేసుకోటానికి ప్రయత్నించింది. బెల్టు కొద్దిగా సాగింది కాని, తెగిపోడానికి కాని, ముడి విప్పడానికి కాని సాధ్యం కాలేదు. ఎలాగైనా ఆ టెలిఫోను ఉపయోగించుకోవాలి. అది తప్ప శరణ్యం లేదు. నెమ్మదిగా అటువైపు దొర్లింది. టెలిఫోను హుక్ మీదనుంచి రిసీవర్‍ను వేళ్ళలో పట్టుకొని పరుపుమీదకి లాగింది. నెమ్మదిగా రిసీవర్‍ని తలగడమీదకి లాగింది, వేళ్ళతో ఒక్కొక్క అంకే లెక్క పెట్టి పోలీస్‍స్టేషన్‍కి రింగ్ చెయ్యాలని మూడుసార్లు ప్రయత్నించింది సాధ్యంకాలేదు. ఇంతలో మరో ఆలోచనొచ్చింది. రెండుచేతులూ చెయ్యగలిగినంత వెడల్పుచేసి అందులోంచి తన పృష్ఠభాగాన్ని తర్వాత తన తొడలనీ ఆ పైన కాళ్ళని నడ్డివొంచి దూర్చింది. అంతే చేతులు ముందుకు వచ్చేయి. ఒక్కసారి భగవంతుడ్ని మనసారా స్మరించి వెంటనే కార్యరంగంలోకి దిగింది. నెంబర్లను వేళ్ళతో తడిమి లెక్క పెట్టి మళ్ళీ పోలీసు స్టేషన్ నెంబర్ ని డయల్ చేసింది. ఈసారి స్పష్టంగా రింగయింది. “హలో టుటౌన్ పోలీస్‍స్టేషన్” అన్నస్వరం వినబడింది. “అక్కడ ఎస్సై మూర్తిగారున్నారా?” “ఉన్నారమ్మా ! తమరెవరు?” “పోలీసు సూపర్నెంట్ రాజారావుగారి భార్యని” అంది సీత నెమ్మదిగా, తరవాత ఆ గది సౌండ్ ఫ్రూఫ్ అన్న మాట జ్ఞాపకమొచ్చింది. “యెస్ మేడం?” అన్న మూర్తి గొంతు వినబడింది. “మిస్టర్ మూర్తీ! నేను చెప్పిండి జాగ్రత్తగా వినండి నేను చాలా ప్రమాదంలో వున్నాను. నన్ను రక్షించాలంటే కొన్ని క్షణాల టైం మాత్రమే ఉంది. మావారిని రిసీవ్ చేసుకోటానికి రైలుస్టేషన్‍కి వెళ్ళేను.” “అర్ధరాత్రి వేళ మీ రెళ్ళడమెందుకమ్మా? మేమందరం..” “ఎదురుప్రశ్నలు వెయ్యొద్దు. ప్లీజ్ నోట్.. అక్కడికి ఏ.డి.కె. 5445 బ్లూ ఎంబాసిడర్ వొచ్చింది. అందులోకి నన్ను బలవంతంగా లాగి, కళ్ళకి చేతులకీ కట్లు కట్టి…” “ఎ.డి.కె. 5445 ఎంబాసిడరా అన్నారు?” “అవును. మాట్టాడొద్దు నోట్ చేసుకోండి. కారు స్టేషన్నుంచి బయల్దేరి ఓ నిమిషం తర్వాత ఎడమవైపుకు తిరిగింది. నాలుగున్నర నిమిషాల తర్వాత కుడివైపుకి, అక్కణ్ణుంచి ఓ నిమిషం లోపలే మళ్ళీ కుడివైపుకి, అక్కణ్ణుంచి ఏడునిమిషాలు స్ట్రెయిట్ రోడ్‍లో వెళ్ళి ఎడమవైపు గేట్లోంచి వెళ్ళింది. ఆ యింటికి ముందు నాలుగు మెట్లున్నాయి. అవి దాటి పన్నెండడుగులు వేస్తే కుడివైపునున్న గదిలో యిప్పుడు నేను బందీగా వున్నాను. ఎవరో గంగరాజుకు జామీను ఇవ్వలేదుట..” “అమ్మ బాబోయ్! వాడి చేతుల్లో పడ్డారా?” “వాడెవడో తెలుసా?” “ఈ స్టేటు మొత్తానికి గజదొంగ. సి.జి.పి గారు కూడా ఏం చేయలేరు. మీరింత అర్ధరాత్రివేళ..” “నీ భార్య నెవరేనా ఎత్తుకుపోయినా యింతేనా!” “అర్ధరాత్రివేళ మా ఆవిడ వొంటరిగా..” “యూ బ్లడీ ఫూల్! నువ్వేమీ చెయ్యలేవు.. చెయ్యవు. మ వారితో చెప్పు. ఆయన్ ఎంతటి గజదొంగనయినా ప్రాణానికి తెగించయినా పట్టుకుని నన్ను రక్షిస్తారు.” “సూపర్నెంటుగారికి ఆ గజదొంగే ఫోన్ చేస్తాడంది ఇప్పుడో, ఇంకో నిమిశఃఆనికో. మధ్యన నేను చెప్పడమెందుకండి? నేణు కలగజేసుకుంటే నన్ను పొడిచేస్తాడు.” “అయితే నువ్వేమీ చెయ్యనంటావు? దౌర్భాగ్యుడా! యిందుకా మీకు గవర్నమెంటు జీతాలిస్తుంది? అల యిక్కడ నేను కుళ్ళి చావాల్సిందేనన్నమాట!” “ఇప్పుడు మీరేం తిట్టుకున్నా నేనేం చేయలేను. ఇప్పుడంతా మా పోలీసోళ్ళకి పుణ్యానికెడితే పాపం ఎదురొచ్చే రోజులు..” “షటప్.. నీ దిక్కుమాలిన లెక్చరాపి, బెంగుళూర్ ఎక్స్‍ప్రెస్‍లో మా వారొస్తున్నారు. ఆయనకి చెప్పు. చచ్చేముందర ఆయన్నోసారి కళ్లతోనైనా చూస్తాను.” “ఇప్పుడు మీరు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారండి?” “యూ ఇడియట్! నా కళ్లకి గంతలు కట్టేడు..” అని తన చేతులు యిప్పుడు వెనకలేవు ముందే ఉన్నాయని గుర్తుకొచ్చి “వెయిటే సెకండ్” అంటూ వేళ్లతో కళ్ళకి కట్టిన చేతి రుమాల్ని తొలగిస్తుండగా ఒక బలమైన చెయ్యి తన వెనుకనుండి ముందువైపుకు వచ్చి వెనకకు అదిమిపట్టింది. “పోలీసోళ్లకి బయపడేవోణ్ణయితే ఈ పన్జెయ్యగల్గుదునా! ఆళ్ళు మనం కూకోమంటే కూకుంటారు లెగమంటే లెగుస్తారు” అంటూ ఆమె మొహాన్ని బలవంతంగా వెనక్కి వొంచి పెదవులమీద ముద్దెట్టుకున్నాడు. ‘థూ’ అని ఉమ్మేసి మోచేత్తో గట్టిగా వాడి పొట్టలో పొడిచింది. ‘అబ్బా!’ అంటూ వాడు వెనక్కి జరగడం, టెలిఫోను డిస్క్ కేసి చూస్తూ రిసీవర్‍లోకి ‘2567’ అనడం ఒక్కక్షణంలో జరిగేయి. “నేనడిగింది మీ యింటి టెలిఫోను నంబర్ కాదు..” అన్న మూర్తి గొంతు సీతకి దిగ్భ్రమ కలిగించింది. నలుమూలలా చూసింది. అది తనగదే. వెనక్కి తిరిగింది. “నేనేడ యిబ్బంది పడతానోనని ఆ రైలు పట్టాలు తప్పిన కాడికి కారు తీసుకొచ్చి యింటికాడ దిగబెట్టిన ఆ యిన్స్‍పెక్టర్ మూర్తి కిప్పుడు నేనెళ్ళి నీ మూలంగా శమాపణ సొప్పుగావాలి,” అంటూ ఆ బొంగురు గొంతు ననుకరిస్తూ పోలీస్ సూపర్నెంట్ రాజారావు పొట్ట చేత్తో రుద్దుకుంటూ కనబడ్డాడు.   (యువ దీపావళి ప్రత్యేక సంచిక)  

No comments:

Post a Comment

Pages