సంపాదకీయం - ఫిభ్రవరి - అచ్చంగా తెలుగు

సంపాదకీయం - ఫిభ్రవరి

Share This


'పలికేది భాగవతమట... పలికించేవాడు రాముడట ....." అన్నారు పోతన.
నిజానికి జనవరి 18 వ తేదీ వరకూ నాకు అంతర్జాల మాస పత్రిక పెట్టాలని కాని, 'వెలుగు పూలు' పుస్తక ప్రచురణ చెయ్యాలని కాని, ఎటువంటి ఉద్దేశం లేదు. ఆ ముందు రోజు వరకూ 'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తకంలో అక్షర యజ్ఞం, మిత్రులతో సాహితీ సత్సంగం, ఆ బృందంలోని పోస్ట్ లను బ్లాగ్ లోకి భద్రపరచడం చేసాను. అయితే, ఒక్క దాన్ని ఎన్నని చేస్తాను? ఇల్లూ, పిల్లలు, చదువులు, బాధ్యతలు, సంగీత సాధన, సాహితీ సేవ, కాస్తంత గురుసేవ.... యెంత సమయం సరిపోయేది కాదు. మంచి మంచి అంశాలు బ్లాగ్ లో భద్రపరచలేక , నిస్సహాయంగా చూస్తూ ఆలోచిస్తే, 'అచ్చంగా తెలుగు' ఫేస్ బుక్ కమ్యూనిటీ పేజి తెరిచి, అందులో షేర్ చేస్తే, గూగుల్ సెర్చ్ ద్వారా ముందు తరాలకు మంచి విషయాలు అందుతాయి కదా, అనిపించింది. సరే, 'అచ్చంగా తెలుగు' బృందం ద్వైవార్షిక వేడుకల సందర్భంలో ఫేస్ బుక్ పత్రిక ప్రారంభించాలని అనుకున్నాను.
 ఆ రోజున భూమిక పత్రిక వ్యాసాల పోటీలో మొదటి బహుమతిగా నాకు కొంత రుసుము అందించారు. అనుకోకుండా కొంత మొత్తం చేతికి చిక్కడంతో, నాకెందుకో అప్పటివరకూ లేని మొండి ధైర్యం వచ్చేసింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ అంతర్జాల పత్రికకు నా పెట్టుబడి, ఆ మొత్తమే ! సరే, ఒక ప్రయత్నం చేద్దాం... అనుకుంటూ బృందంలో ఒక్క సందేశం పెట్టగానే, ఎంతో మంది ఆత్మీయులు 'మేమున్నాము... మీ ప్రయత్నం కొనసాగించండి...' అంటూ ముందుకొచ్చి ప్రోత్సహించారు. కొందరు పుస్తకానికి ఆర్ధిక సహాయం చేసారు, కొందరు ఉచితంగా టైపు చేసి పెట్టారు, కొందరు రచనలు పంపారు, కొందరు వచ్చిన రచనలు ప్రూఫ్ చదివి పెట్టారు, కొందరు వెన్నుతట్టి ప్రోత్సహించారు, కొందరు దిశానిర్దేశం చేసారు. ఇంత మంది కలిస్తేనే ఈ రోజున కళ్ళముందు చక్కటి పత్రిక రూపుదాల్చింది, 'వెలుగు పూలు' పుస్తకం వెలుగు చూసింది.
అందుకే ఈ పత్రిక ఇంత మంది కలల కానుక ! సమిష్టి విజయ దీపిక ! ఈ పత్రిక మనందరిదీ. ఇందుకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. పలికేది నేనైనా, పలికించింది దైవ స్వరూపులైన మీ అందరే! అందుకే మీ అందరికీ శిరస్సు వంచి వినమ్ర నమస్కారం చేస్తున్నాను.
మరొక్క ముఖ్య విషయం... ఈ పత్రిక డిజైన్ కోసం ప్రణాళిక సిద్ధం చేసి, ఒక్క రూపాయి ఆశించకుండా, ఏ పెద్ద అంతర్జాల పత్రిక నాణ్యతకు తగ్గకుండా, అనుకున్న సమయానికి ఇంత చక్కటి పత్రికను ఆవిష్కరించడంలో నాకు సహాయపడిన పెద్ద మనసున్న చిన్నవాడు కానం శ్రీకాంత్ కు ఈ సందర్భంగా మన అందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మున్ముందు మీ అందరి ఆశలకు అనుగుణంగా, మంచి మంచి రచనలు అందించి, మీ హృదయాల్లో ఉదారంగా మీరు నాకిచ్చిన స్థానం నిలుపుకునే ప్రయత్నం చేస్తానని, మాట ఇస్తూ...
'అచ్చంగా తెలుగు' సభ్యులు అందరికీ ద్వైవార్షిక వేడుకల శుభాకాంక్షలతో...
మీ
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages