రామాయణ ముఖ ద్వారము - అచ్చంగా తెలుగు

రామాయణ ముఖ ద్వారము

Share This
రామాయణ ముఖ ద్వారము 

చెరుకు రామమోహనరావు 


యావత్ స్థాంస్యతి గిరియః సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యంతి
రామాయణ మహా కావ్యం శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం పాతక నాశనం
గిరులు తరులు ఝరులు ధరలో వరలినంత కాలం రామాయణ కథ ఈ లోకంలో ప్రచలితమై వుంటుంది.  శతకోటి ప్రవిస్తరమైన  ఈ మహాకవ్యములోని ఒక అక్షరం వల్లించినా జనుల పాతకములు పటాపంచలౌతాయి.
ఆయనము అంటే ప్రయాణము.  అది రాముని యొక్క ప్రయాణమా?  రాముని కొరకు ప్రయాణమా ?
రాముని యొక్క ప్రయాణమైతే పరుడైన పరమాత్మ నరుడై ధర్మపరుడై పితృవాక్య తత్పరుడై అసురోత్పల (ఉత్పల=కలువలు) దివాకరుడై, వనచరుడై, వనచరసహితుడై, జనహితుడై, జగన్మోహితుడై మానవాళికి ఆదర్శప్రాయుడై నిలచిన నరుడు.
రాముని కొరకు ప్రయాణమైతే విష్ణుడై, ప్రియహృచ్చరిష్ణుడై, సంపద్వరిష్ణుడై, వసుదైక జిష్ణుడై, యశోరోచిష్ణుడై, భక్తహర్షణుడై, వైరిధర్షణుడై, కృపావర్షణుడై, పరుడై, విశ్వంభరుడై నిలచిన ఆ హరిని చేరుట.
అంటే రామాయణమన్న కత్తికి రెండువైపులా పదునే.  పరుడు నరుడై అవతరించి అవనికి ఆదర్శమై నిలచినాడు. తన విభూతులను అవతారసమాప్తి వరకు ఎక్కడా చాటుకోడు.
ఆదికావ్యమై, అజరామరమై, ఆదర్శవంతమై, అత్యంత సునిశిత ధర్మ సంపన్నమై అనంత మానవాళి ఆర్తిని తీర్చి అచ్యుతుని పాదసన్నిధికి చేర్చే అద్భుత సాధనముగా రామాయణమును వాల్మీకి మహర్షి మలచినాడు.
ఎవరు ఈ వాల్మీకి? వాల్మీకి చరిత మనకు ఉత్తర కాండలో వస్తుంది.  స్కంద పురాణాదులలో కూడా వాల్మీకి చరిత్ర వస్తుంది.  కానీ ఇచట తన కథ తనచే రచింపబడిన రామాయణము నుండే గ్రహించుట జరిగినది.  వాల్మీకి పేరు రుక్షుడు.  నిజదారసుతోదర పోషణార్ధం వ్యాధుడై, మమకార వికారగ్రస్తుడై, మునుల దయతో పరాజ్ఞ్మఖుడై విలోమ “రామ” మంత్ర స్వీకృతుడై అకులదిత తపో దీక్షా దక్షుడై, శరీరమును విస్మరించి పరమేశ్వర ధ్యానమునందు మనసును సంధించిన వాడై, తన చుట్టూ వాల్మీకము (పుట్ట) పెరిగినా, శరీర ధ్యాసను వదిలి ఆత్మను పరమాత్మకు అనుసంధించిన నాడౌత, ఆయన వాల్మీకి అయినాడు. వరుణుని ప్రచేతసుడంటారు. ఆ వరుణుని అనుగ్రహముతో కల్గిన వర్షము వల్ల ఆయన ప్రాచేతసుడని కూడా పిలవబడియుండవచ్చును. దీని వల్ల మనము గ్రహించినది ఏమిటంటే వాల్మీకి మమకారమునకతీతుడై, మనసునందు పరమాత్మ భావన నింపుకొన్న తరువాతనే ఆయన రామాయణ రచనకు యోగ్యుడైనాడు. అంటే రజస్తమోగుణ విముక్తుడై శుద్ధ సాత్వికుడైనాడు.
అటువంటి రామనామ మహిమ మాత్రమే తెలిసిన వాల్మీకిని తగిన వానిగా నెంచుకొని, రామ మహిమ గూర్చి జగతికి తెలియజెప్ప ప్రేరేపించుటకు వచ్చినాడు నారదుడు.
నారదుడు ఎటువంటి వాడు అంటే
“తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిప ప్రచ్చ నాత్మకర్మునిపుంగవం”
అన్న ఈ శ్లోకం  వల్ల  తెలుసుకొనవచ్చు
నారదుడు బ్రహ్మజ్ఞుడెట్లైనాడు అంటే తపసా బ్రహ్మ జిజ్ఞాసస్య అన్నారు పెద్దలు. అందువల్ల ఆయనను  “తపస్వి” అని సంబోధించినాడు వాల్మీకి. ఇక రెండో విశేషణము స్వాధ్యాయ నిరతుడు. తండ్రియగు బ్రహ్మ నుంచి వేదములను గ్రహించి నిరతము మననము చేయుచునే వుండేవాడు. వేదనాదము విష్ణువు. విష్ణువును నిరంతరము జపించుట వల్ల ఆయన స్వాధ్యాయుడైనాడు. ఇంకొక విశేషణం వాగ్విదాం వరుడు. వాక్కు అనగా వేదము విద్ అంటే ఎరిగినవాడు. అంటే వేదముచే ప్రతిపాదింపబడిన ధర్మమూ బ్రహ్మముతో కూడి భూమి పై నడయాడు నరజన్ముని గూర్చిన ఎరుక కలవాడు “వాగ్విదాంవరుడు”.  అందువల్లనే ఆయన సరియైన శిష్యుని వాల్మీకి రూపంలో ఎంచుకొన్నాడు.  అసలు నారము అంటే జ్ఞానము అంటే దైవజ్ఞత. ద అంటే ఇచ్చువాడు. నరుడు అన్న పేరు భగవానునికి కుడా కలదని విన్నాను.  నారమే తానై యున్నవాడు నరుడే కదా. నర శబ్దము మాత్రమె గైకొన్నచో జీవుడని అర్ధము. జీవుడు జ్ఞానియగువరకు అజ్ఞానియేకదా.  అంటే నరునియొక్క అజ్ఞానము నారమే కదా. కావున నారమును పోద్రోలి నారమును గ్రహించి, నారమునకు ఆదియౌ నరుని యందు ఐక్యము గొనుటయే ఈ రామాయణ రచనా ఉపోద్ఘాతము.
రామాయణమునకు మూడు పేర్లు గలవు.  1. రామాయణము 2. సీతా చరితము 3. పౌలస్య వధ. ఈ మూడు పేర్లు రామాయణమును మూడు ముక్కల్లో చెప్పినట్లు మనకు స్ఫురిస్తాయి.  రామాయణము అంటే దేవుడు. రాముడుగా భూమి పై వెలయుట, సీత చరిత్ర రామునికూడి సీత వనములలో చరించుట, పౌలస్య వధ అంటే రావణ సంహారము. అంటే ఒక కావ్యానికి అందులోనూ ఆదికావ్యానికి ఇంత  భావస్ఫోరకమైన మూడు పేర్లను వుంచిన ఆ మహర్షిది ఎంతటి ప్రాజ్ఞత, ఎంతటి విజ్ఞత, ఎంతటి ఉపజ్ఞత, ఎంతటి సర్వజ్ఞత.  ఇక్కడ ఇంకొక అంతరార్ధము కలదు.  రాముడు పరమాత్మ, సీత మనసు, రావణుడు ‘వాసనా’ భారితుడు.  ఈ ప్రాపంచిక వాసనలు మనసును వశపరచుకోదలిస్తే మనసు చలించక తనయందు పరమాత్మనే నింపుకొని ఆయననే చేరుట అంతరార్ధము.  ఎందుకు రావణుడు వాసనా భరితుడు అంటే అసలు ‘రవము’ అంటే శబ్దము.  ఈ ప్రపంచం శబ్దమయము. దీనికి తోడు అతడు దశముఖుడు కూడా. దశవారా విరాట్.  విరాడన్నం అన్నది వేదం వచనం. దశ దిశలా వ్యాపించిన ఈ విరాడ్రూపమైన జగత్తే కదా దశ ముఖుడంటే. అది అసలు విషయం. ఇక రామాయణ కావ్య రచనా ఉపక్రమణమెట్లు జరిగినదో ఒక సారి పరిశీలించెదము.
వాల్మీకి మహర్షి యొకనాడు గౌతమాది శిష్య సమేతుండై సరయూ నదీ తీరంబునకు తన ప్రాతః సంధ్యాది విధులను నిర్వర్తించుకొనబోవు సమయంబున ఒక నిషాదుడు చెట్టు పైగల క్రౌంచ పక్షుల జంటను కొట్టగా మహర్షి శోకముప్పొంగి మానవరూపుడైన మహర్షిచే భూమిపై వెలసిన మొదటి శ్లోకమైనది.  ఇక ఆ శ్లోకమును విశ్లేషించి చూద్దాము. మహనీయుల వాక్కులు ఎప్పుడునూ అప్రతిహతములు. అటువంటి వాక్కులు అనుకోకుండా వెలువడినపుడు వానికి అర్ధమేకాక అర్ధాంతరములు కుడా ఉండునని పండిత వాక్కు. ఇపుడు ఈ శ్లోకములో గల 1.బాహ్యార్ధ  2.అంతరార్ధ  3.గుడార్ధాలను గమనించుదాము.
1.బాహ్యార్ధము:
నిషాద : ఓరీ కిరాతకుడా త్వం=నీవు; పుతిష్టాం=లోకంలో నివసించడమనేది; శాశ్వతీసమాః = ఎన్నో ఏండ్ల; మాగమః = పొందలేవు; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = క్రౌంచ పక్షుల జంట నుండి; ఏకం = ఒకదానిని; కామమోహితం = కామసుఖమనుభవించుచుండగా; అవధీః = వధించితివి.
కామ మోహితమైయున్న ఈ క్రౌంచ మిధునమునొకదానిని వధించిన కిరాతకుడా! నీవు ఎక్కువ కాలము భూమిపై నిలువలేవు.
2.అంతరార్ధము:
మానిషాదః = ఓ శ్రీపతీ; త్వం = నీవు; శాశ్వతీసమాః = కలకాలము; ప్రతిష్ఠాం ఆగమ = లోకములో ప్రతిష్టను పొందితివి; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = రాక్షస జంటనుండి; కామమోహితం = పరదారా కాముకుడైన; ఏకం = ఒకడిని; అవధీ = వధించితివి.
ఓ శ్రీహరీ! రాక్షస జంటనుండి పరదారాకాముకుడైన యొకనిని వధించి జగతిన శాశ్వతమైన ప్రతిష్టను పొందితివి.
3.గూడార్ధము:
మానిషాద = మాయాశక్తికి అధీనమైన ఓ జీవుడా; త్వం = నీవు; మానిషాద = మాయాతీతుడైన యా పరమాత్మ భావాన్ని; ప్రతిష్ఠాం ఆగమః = పొందగలిగితిని;   యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = ‘ద్వాసుపర్నాసయుఔస్సఖాయా’ అంటే పక్షుల జంటను బోలిన జీవాత్మ పరమాత్మలతో; ఏకం కామమోహితం = ప్రాపంచిక సుఖాలపై మనసు పడిన జీవాత్మయనుదానిని; అవధీ = వధించితివి; (బ్రహ్మ విద్య యను బాణముతో మనో ఏకాగ్రత యను ధనువునకు సంధించి) ఓ మాయ శక్తి కి అధీనమైన జీవుడా! ప్రాపంచిక సుఖాలపై మోజు పడిన; జీవాత్మ  పరమాత్మయను పక్షుల జంటలోని యొక దానిని వధించి మాయాతీతుడైనయా పరమాత్మ భావాన్ని పొందగల్గితిని.
చూచితిరికదా! ఎంతటి భావము, ఎంతటి భాష, మాటలో ఎంతటి సంస్కారము.  తత్వమరసిన  ఆది కవి వాల్మీకి మహర్షికే ఇది సాధ్యము. అందుకే కాళిదాసు తన రఘువంశములో వాల్మీకి తో తనని పోల్చుకొంటాడు. ప్రాంశులభ్యే ఫలేలోభా దుద్బాహురివవామనః  ఎత్తైన వ్యక్తికి చేతికందే ఫలాన్ని, పొట్టివాడు అందుకొన సాధ్యమా! అని... కాళిదాసునిది ఎంత వినయము, ఎంత విధేయత వాల్మీకి కవిపై ఎంత గౌరవమో చుడండి.  వాల్మీకి రామాయణముండగా మళ్ళీ నీచంపు రామయణమెందుకయ్యా?  అని భోజరాజును ప్రశ్నిస్తే ఆయన ఈ విధముగా సమాధానమిస్తాడు. గంగాజలైః భువి భగీరథ యత్న లబ్ధైః కిం తర్పణం నవిదధాతి జనః పితౄణాం.
అంటే గంగా జలాన్ని భాగీరధుడే తెచ్చినా పుణ్య కార్యములకు ఆ నీటిని అందరు వాడుటలేదా అని తిరిగి ప్రశ్నించినాడు.  కానీ వాల్మీకిని భగీరధుడు అన్నాడు భవభూతియైతే వాల్మీకిని బహువచనముతోనే సంబోధించి గౌరవించుటయే కాక ఆయనయొక్క అమృతమయమైన వాక్కునకు కూడా నమస్కరిస్తాడు.  ఇంతా జేసి అయన ‘కవి’ మాత్రమే. కానీ నేడో ‘భావకవి’ ‘మధురకవి’ ‘విప్లవకవి’ ‘దిగంబరకవి’ ‘యుగకవి’ ‘వచనకవి’ తుత్తికవి సుత్తికవి యని తప్పించి నిర్విశేషణముగా ఉత్తి ‘కవి’ అనిపించుకొన్నవారు వున్నారా!.  అంటే ఆవిధంగా కూడా కవి యన్న పేరు గల్గిన వాల్మీకికి మేము బహుదూరము అని నిరూపించుకొన్నారేమో.
అసలు రామాయణ ముఖద్వారము వద్దకు ఎందుకు పోవుచున్నాము రాముని తలచుటకు రాముని కొలుచుటకే కదా! మరి ఇపుడు రాముని గూర్చి పెద్దలచే విన్నంత కన్నంత, తెలియవచ్చినంత లోని తేటను మాత్రమే గ్రహించిన నేను నా శక్తి కి వంచన చేయకుండా తెలిపే ప్రయత్నము చేస్తాను.
రామాయణ ప్రబోధమొక్కటే! పరుడే నరుడు నరుడే పరుడు. ఈ భూమిపైకి మహా విష్ణువు మానవ రూపములోనేవచ్చి రావణుని వధించ గలడని మునులు తెల్పగా తధాస్తు అంటూ ఆయనే “దశవర్షసహస్రాణి దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే పాలయన్  పృథివీమిమాం” అని పదకొండు వేల సంవత్సరములు భూమిపై మానవునిగ నిలిచి పాలించెదనని హామీ ఇస్తాడు. ఇక పుట్టినది మొదలు సరయూ నదిలో ఆత్మ త్యాగము చేసుకొను వరకు దేవునిగా తన విభూతులను ఎక్కడ ఏ పరిస్థితి లోను ప్రదర్శించడు.
రామాయణం తపస్వాధ్యాయనిరతం... తో మొదలౌతుంది. మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని ‘త’ తో మొదలుపెట్టుటయే శుభసూచకము.  త కారో విఘ్న నాశాయ త కారో సౌఖ్య దాయకం  అన్నది ఆర్య వాక్కు.  పై శ్లోకమును గూర్చి ముందే  ముచ్చటించు కొన్నాము కావున పై శ్లోకములోని విశేషణములు కల్గిన నారదుడు వాల్మీకి యడిగిన ప్రశ్నలకు బదులుగా చెబుతాడు.  వాల్మీకి ప్రశ్న ఏమంటే పురుషులలో ఉత్తముడై ఈ క్రింది పదునారు గుణములు కల్గిన వ్యక్తిని గూర్చి?  అసలు పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడే కదా!  అంటే ఇంకో విధముగా పురుషోత్తముని లక్షణములు గల పురుషుని గూర్చి యడుగుచున్నాడు.  ఆ లక్షణములేవియన
1.గుణవంతుడు 2.వీర్యవంతుడు 3.ధర్మజ్ఞుడు 4.క్రుతజ్ఞడు 5.సత్యవాక్యుడు 6.ధృడవ్రతుడు 7.సుచరితుడు 8.సర్వ భూత హితుడు 9.విద్వాంసుడు 10.సమర్ధుడు 11.ఏక ప్రియ దర్శనుడు 12.ఆత్మవంతుడు 13.జితక్రోధుడు 14.ద్యుతిమంతుడు 15.అనసూయుడు 16.సుధీరుడు.
అనగా యుద్ధమున కోపమే కల్గిన దేవతలనే భయపెట్టువాడు.  ఈ పదునారు లక్షణములు గలవాడు శ్రీరాముడేయని  నారదుడు వాల్మీకితో అంటాడు.  ఈ పదునారు లక్షణములతో పదునారు కళలు గల రామచంద్రుడైనాడు.  అని మనమనుకోవచ్చునేమో.
బ్రహ్మమొక్కటే... యన్న అన్నమయ్య మాటను మనము తీసుకొంటే బ్రహ్మ అను పదములో ‘ర’ ‘మ’ అను రెండక్షరాలను మనము అంతర్లీనముగా చూడవచ్చును. ‘ర’ అంటే దావనలమై దహించేది.  అనగా మనలోని దుష్ట, దురహంకార, దురాశాపూరిత సకల కామాళిని దహించి వేసి  ‘మ’ అనగా మనసున మహదానంద తుందిలితమై యొప్పారునట్లు చేయును. అందుకే పరమశివుడు ‘రామ’ తారక మంత్ర పరవశుడు.  రామ మంత్రము రామజననాత్పూర్వమే రాజిల్లుచుండినది.  రమింప జేసే తత్వము కలుగుట వలననే రామాయణ నాయకుడు రాముడై, జగదభిరాముడైనాడు. రామ శబ్ధములో ఇంకొక ప్రత్యేకత వుంది. అక్షరమాలలో య ర ల వ లో ‘ర’ రెండవ అక్షరము. అదేవిధంగా ప ఫ బ భ మ లో ‘మ’ ఐదవ అక్షరము 2 x 5 = 10. ’కేనోపాయేనలఘునా’ అని పార్వతీ దేవి విష్ణు సహస్ర నామ ఉత్తర పీఠికలో అడిగితే ఈశ్వరుడు శ్రీ రామ రామ రామేతి... అని రామ రామ రామ అని మూడు సార్లంటాడు. అంటే 10x10x10=1000.  అందువల్లనే అదే శ్లోకములో... సహస్ర నామ తత్తుల్యం అన్నాడేమో!
రామునిది దశావతారాలలో ఒక అవతారముగానే పరిగణింపబడినది. ‘పరిత్రాణాయ... అని భగవద్గీతలో అన్నట్లు రామునిగా కూడా పదకొండు వేల సంవత్సరములు మానవుని వలె మాత్రమే జీవించి మానవులకు ఆదర్శ ప్రాయుడైన మానవుడు ఏ రీతిగా వుండవలెననేది నిరూపించినాడు. ఇక దీనికి వత్తాసు జయ విజయుల కథ. ఇది అందరికి తెలిసిందే.
కానీ రాముడు కృష్ణుని లాగ ఎటువంటి లీలలను చూపడు. ఆయన మానవుని గానే వుంటానన్నాడు కాబట్టి ఆయన పదునారు లక్షణములతో సత్యవాక్పరిపాలన కూడా కలదు గదా.  ఆయన జితక్రోధుడు.  కోపము కావలిసినపుడు తెచ్చుకొంటాడు.  సముద్రుని విషయంలో అదే కదా చేస్తాడు.  అప్పటికీ వారధి కట్టుకొని పొమ్మంటాడేకాని, బాలకృష్ణుని బుట్టలో మోసుకొని పోవునపుడు దారి వదిలిన యమునలాగా దారినివ్వడు సముద్రుడు.  ఇదంతా మానవుడు అనుకొంటే సాధించ లేనిది లేదు అని నిరూపించేటందుకే ఆ నరునికి తోడు దేవ ముని తాపసులను తన వక్త్రము (నోరు) నుండి బయల్వెడలిన జాంబవంతుడు తోడు రాగా వీరంతా వాలి సుగ్రీవ హనుమన్నల నీల కుముద పనస గజగవయ గంధమాదనాదులుగ జన్మించి తమ తమ వర్గములతో  వానరులై భూమి నిండిపోయినారట. అంటే పరుడు నరుడైతే పరివారము వానరులైనారు.
విశ్వామిత్రుని అనుసరించే ఘట్టములో కుడా ఆ బ్రహ్మర్షి నుండి ఎన్నో విద్యలు నేర్చుకొంటాడు.  తానూ పరమాత్మయన్న స్పృహను దరిచేరనీయడు. విశ్వామిత్రుడు “నృశంస మన్న శం సం వా  ప్రజారక్షణకారణాత్ పాతకంవాసీంరోషంవా కర్తవ్యం రక్షతా సతా రాజ్య భార నియుక్తానాం ఏష ధర్మస్సనాతనః”  రామ రక్షణకు నియమించబడిన రాకుమారులు పాలిట రక్షణ క్రూరమేయైననూ, నిందింప దగినదైనను, పాపమేయైనను వెనుకాడక అట్టి కర్మలు చేసి తీరవలెనని  ‘తాటక సంహారమప్పుడు  తెల్పగా రాముడు ఆయనకు ఈ విధముగా బదులిస్తాడు.
పితుర్వచన నిర్దేశాత్
పితుర్వచన గౌరవాత్
వచనం కౌశికసస్యేతి
కర్తవ్యమనిశ్సంసయాః
గురువర్యా! మా తండ్రి గారైన దశరథుని ఆజ్ఞ వలన ఆయనపై గౌరవము వలన మీరు నిర్దేశించిన ఎడల స్త్రీ వధనైనను చేయగలనని అంటాడు. ఆ విధంగానే చేస్తాడు. రాముని ధర్మనిరతికి మెచ్చి తన వద్ద కలిగిన సకల శస్రాస్త్ర విద్యలన్నీ సమంత్రకముగా ఉపదేశించెను. మానవునిగా గుర్వనుగ్రహమునకు పాత్రుడగుట తప్పించి పరాత్పరుడనైన  నాకే నేర్పించుచున్నాడే యనుకోలేదు.  యాగ సంరక్షణ సమయమున కూడా ఇంకా ఆ రాక్షసులు రాలేదే యని అడుగుతాడు.  ఇది చివరి రోజైన ఆరవ రోజు ఈ రాత్రికి వారు విజృంబింతురని ది తెల్పుటయూ, అటులనే వారు విజృంభించుటయు రాముడు ఆగ్నేయాస్త్రమున సుబాహుని కూల్చుటయు, మారీచుని మానవాస్త్రమున శతయోజన దూరము గల్గిన సముద్రములోనికి విసరివేస్తాడు.  తన దైవత్వమునే వుపయోగించియుంటే ఇంత రామాయణమవసరమేలేదు. దేవతలే దిగివచ్చి నీవు సాక్షాత్తు నారాయణుడవంటే ఆయన ఆత్మానూమానుషంమన్యే.  అని తనను మానవునిగానే తలుస్తాడు.
కైకేయి చేసిన పనికి ఆగ్రహోదగ్రుడై ఆమెను కొడతానని లక్ష్మణుడంటే నన్నెంతో వాత్సల్యముగా చూచుకొనే తల్లి ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే యది భావోన దైవోయం అంతా దైవ ప్రేరణే అంటాడు. ఆ దైవము తానే మరియు ఆమె తోడ్పాటు లేకుంటే అడవి దారి పట్టేవాడా రావణుని తన కోలతో కొట్టేవాడా!  కృతయుగములో తాను విష్ణువుగా దనుజుల గెలిచిన ధనుర్బాణాది మహాస్త్రములు అగస్త్యునినుండి పొంది మహర్షికి కృతజ్ఞతలు వ్యక్తము చేసుకొంటాడే తప్పించి నావి నాకే గదా వచ్చినాయన్న అహంకారాన్ని చూపడు. అది అగస్త్యుని ఆశ్రమానికి శరభంగ సుంరీక్షకులను మరీ మరీ అడిగి పోతాడు. లోనఏమున్న పైకిమాత్రం అంతా మానవ గుణమే. అగస్త్యునివద్దకు పోవుటలోని మరొక  అంతరార్ధం చిత్రకూట నివాసం. అగస్త్యమహర్షి సీతా రామ లక్ష్మణులను పంచవటికి వెళ్లి అక్కడ వుండమని సలహాయిస్తాడు. రాక్షస మయమైన ఆ ప్రాంతమున వారిని తుదముట్టించుటతో రావణ సంహారానికి నాంది పలుకవచ్చు. లోపల ఏమున్నా పైకి మానవుడే. భార్య బంగరు లేడి కావలెనన్నపుడు కూడా అది మాయ అంటూనే తెచ్చియిస్తానంటు బయలుదేరుతాడు.  తన ప్రవర్తనతో ఇక్కడకూడా తాను దైవమన్న అనుమానానికి తావివ్వడు. ఒక సందర్భములో లక్ష్మణునితో కామాతురుడయ్యు తనపై ఆవ్యయమైన అభిమానము కల్గిన తండ్రికి తనను అడవులకు పంపుటకు హేతువై ప్రాణ త్యాగమే చేయవలసి రావడం తన పాపానికి ప్రాయశ్చిత్తమని ఒక సాధారణ మానవుని లాగా మాట్లాడుతాడు. లంక ఎంత గొప్పగా వుంది అని లక్ష్మణుడంటే ఏ దేశము ఎంత గొప్పదైన జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. అందుకే శత్రువైన  మారీచుని  చేతనే రామో విగ్రహవాన్ ధర్మః అని కొనియాడబడుతాడు.
ఈవిధంగా షోడశ గుణాకరుడైన రాముని గూర్చి, ఎంతైనా చెప్పుకొంటూనే పోవచ్చు. బాలకాండ నుండి ఉత్తరకాండ దాకా మనము గమనించితే శ్రీ రామచంద్రుడు ఏడు కాండలలోను ఏడు ధర్మాలు పాటించినాడు. బాలకాండలో శిష్య ధర్మం, అయోధ్యకాండలో పుత్ర ధర్మం, అరణ్యకాండలో క్షాత్ర ధర్మం, కిష్కింధకాండలో మిత్రధర్మం, సుందరకాండలో స్వామి ధర్మం, యుద్ధకాండలో వీరధర్మం మరి ఉత్తరకండలో రాజధర్మం. అడుగడుగునా అణువణువునా తాను మానవునిగానే నడుచుకొంటూ పదకొండు వేల సంవత్సరాలు ధర్మ ప్రతిష్ఠాతయై, ఆదర్శ మానవుడై, అరివీర భయంకరుడై, ఆశ్రిత రక్షకుడై, జితక్రోధియైన ఆ మహనీయుని ఎంత తలచుకొన్నా తక్కువే.
ఎందరో మహనీయులు రామాయణ గంగా ప్రవాహములో మునకలు వేసినారు.  నాలో వ్రాయవలయునన్న చపలతే కానీ చతురత లేదని తెలుసు. ఈ గంగలో నేనూ ఒక మునక వేసినానని చెప్పుకొంటాను.
దాసరి తప్పులు దండముతో సరి.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం
తత్సత్

No comments:

Post a Comment

Pages