ఈ నెల ప్రత్యేక పరిచయం... “చిత్రకారుడు హంపి “ - అచ్చంగా తెలుగు

ఈ నెల ప్రత్యేక పరిచయం... “చిత్రకారుడు హంపి “

Share This

ఈ నెల ప్రత్యేక పరిచయం... “చిత్రకారుడు హంపి “

ఎన్ని కుంచెలు విశ్వమనే కాన్వాస్ మీద వేవేల వర్ణ చిత్రాలు ఆవిష్కరించినా, ముచ్చటైన మన ‘తెలుగు బొమ్మ’ లకు సాటిరావు. అటువంటి అద్భుతమైన బొమ్మలు గీసే చిత్రకారులను, అందరికీ పరిచయం చేసే వేదిక ఈ “తెలుగు బొమ్మ”. ఇందులో కొత్త కుంచెలు, ముగ్గులు కూడా ప్రచురిస్తాము. ఈ నెల ప్రత్యేక పరిచయం... “చిత్రకారుడు హంపి"



 
మన “అచ్చంగా తెలుగు” లోగో చూసారు కదూ... యెంత ముచ్చటగా ఉంటుంది ? మధ్య హంసవాహిని, చుట్టూ ముగ్గులా అల్లుకున్న అక్షరాలు.... మరి ఆ లోగో మనకు వేసి ఇచ్చింది ఎవరో తెలుసా? చదవండి... అతని బొమ్మలు మాట్లాడతాయి. భావాల వర్ణాలు మనసులపై ఆవిష్కరిస్తాయి. బాధ, కోపం, సంతోషం, దేశభక్తి, తెలుగు సంస్కృతి, గీతా సారం, ఏవైనా అలవోకగా వర్ణాల్లో ఒదిగిపోతాయి. అతని కుంచెకు హృదయ భాష తెలుసు. పండితులకైనా, పామరులకైనా అవలీలగా అర్ధమయ్యే రీతిలో చిత్రకళను, మనసు స్పందనను - వర్ణాల్లో మేళవించి కళ్ళ ముందు అద్భుతాల్ని సృష్టించడం, అతనికే చెల్లింది. ‘బాపు’ మెచ్చిన బొమ్మ అతనిది. వినయంగా మాట్లాడడం, అడిగినవారికి వెంటనే సాయం చెయ్యడం, ఇతనికే సొంతం. సున్నిత
హృదయుడు, సృజనాత్మక కళాకారుడు, అతనే చిత్రకారుడు హంపి.  అతని గురించి అతని మాటల్లోనే... నమస్కారం ! నా కుంచె పేరు హంపి. నా పేరు ఎం. వెంకటేశ్వరరావు .సుమారు పదిహేడు సంవత్సరాలుగా వివిధ దినపత్రికలకు, వారపత్రికలకు, ఇల్లుస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాను. కధలకు బొమ్మలు, ఎడిటోరియల్ కార్టూన్లు వంటివి వెయ్యడం నా వృత్తి. ఈ పనుల్లో పడి, చాలా కాలంగా దూరమైన పెయింటింగ్ పై కూడా ఇప్పుడు దృష్టి పెడుతున్నాను. రాజమండ్రి లోని శ్రీ నగేష్ గారి దగ్గర కొద్దిపాటి శిష్యరికం చేసాను. ఆర్ట్ గాలరీ లోని దామెర్ల రామారావు గారి చిత్రాలను ఆరాధనగా చూస్తూ పెరిగాను. మనసు స్పందించినప్పుడల్లా, నా స్పందనను కుంచె రంగుల్లో మేళవించి బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. మొదట తెలుగు తల్లి బొమ్మ వేసిన శ్రీ కొండపల్లి శేషగిరి రావు గారు, 95 లో రాజముండ్రి వచ్చినప్పుడు నేను వేసిన బొమ్మలు చూసి, “ఇతనికి మంచి ప్రతిభ సృజన ఉన్నాయి. ఐదేళ్ళలో తనదైన ముద్ర వేస్తాడు ” అని చెప్పారు. భగవద్గీతకు నెమలి
పించం , అందులో ఒదిగిన విశ్వం రూపంలో నేను గీసిన బొమ్మను చూసి బాపు గారు అన్వర్ గారి వద్ద, ‘హంపి వేసిన ఆ బొమ్మ చాలా గొప్పగా ఉందోయ్...’ అంటూ ప్రశంసించారట. ఇది నాకు గొప్ప కితాబు. ఆయన మాటలను నేను దీవేనల్లా భావిస్తాను. సుమారు నాలుగేళ్ల క్రితం వేసిన ‘మూడు చేతులు కలిసిన ఆంధ్రప్రదేశ్ ‘ చిత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో విస్తృతంగా ప్రచారానికి లోగో లాగా ఉపయోగపడింది. కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ అనేక కార్టూన్లు, పోస్టర్స్, ఆనిమేషన్లు కూడా రూపొందించాను. ప్రస్తుతం పల్నాటి వీర గాధను  చిత్రంగా రూపొందించే పనిలో ఉన్నాను. మున్ముందు మరిన్ని మంచి బొమ్మలు వేసి, తెలుగు నాట నాకంటూ ఒక అస్తిత్వాన్ని సంపాదించుకోవాలని ఆకాంక్ష ! కృతజ్ఞతలతో హంపి. ఈమెయిలు : hampi.artist@gmail.com ఫోన్ : 9490886726.       

No comments:

Post a Comment

Pages