మాటే మకరందం - డా|| బి.వి. పట్టాభిరాం - అచ్చంగా తెలుగు

మాటే మకరందం - డా|| బి.వి. పట్టాభిరాం

Share This

మాటే మకరందం 
-  డా|| బి.వి. పట్టాభిరాం బోయకులంలో జన్మించిన రత్నాకరుడు అడవిలో పక్షుల్ని,జంతువుల్ని వేటాడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని వృత్తి నిర్వహణలో ఎన్నో అమాయక ప్రాణులు బలయ్యేవి. అది చూసిన నారదుడు వాటిపై జాలిపడి రత్నాకరుడిని కలిశాడు.
 “ఎందుకీ అపరాధం చేస్తున్నావు? నీవల్ల ఎన్ని అమాయక జీవులు బలి అవుతున్నాయో తెలుసా?" అని అడిగాడు. "నన్నేమి చేయమంటారు స్వామీ? ఇది నా కులవృత్తి. పైగా నేను నా భార్యను పోషించాలంటే వేరే మార్గం  లేదు కదా!" అని సమాధానమిచ్చాడు.
"పిచ్చివాడా! మనసుంటే మార్గం ఉంది. నువ్వు ఈ పని చెయ్యడం వలన ఎంత పాపం మూటకట్టుకుంటున్నావో తెలుసా?"
"నేనొక్కడినే ఎందుకు కట్టుకుంటాను? ఈ పాపంలో నా భార్యాబిడ్డలుకూడా పాలుపంచుకుంటారు" అని  సమాధానమిచ్చాడు.
"అమాయకుడా! వాళ్ళెందుకు పంచుకుంటారు? కావాలంటే వెళ్ళి అడుగు?" అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యకు ఈ వృత్తాంతం అంతా చెప్పి "పాపంలో పాలు పంచుకుంటావా?" అని అడిగాడు. దానికి భార్య నవ్వుతూ భలేవాడివే! మేమెందుకు పంచుకుంటాము?అది నీ బాధ్యత. నువ్వు ఎక్కడినుండి తెచ్చావో, ఎలా తెచ్చావో మాకు అనవసరం. కట్టుకున్నందుకు నన్ను, కన్నందుకు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీదే! ఇంకెప్పుడూ ఇలాంటి అసందర్భపు  ప్రశ్నలు వేయొద్ద'ని తెగేసి చెప్పింది.
ఈ  సమాధానం రత్నాకరుడికి  ఎంతో ఆశ్చర్యం కలిగించింది.  అదే విషయం నారదుడిని కలిసి చెప్పాడు.
తన కళ్ళు తెరిపించినందుకు నారదుడికి కృతఙ్ఞతలు తెలిపాడు. నారదుడు అంతా విని కనువిప్పు కలిగిన రత్నాకరుడికి మంత్రోపదేశం చేసాడు. ఆ క్షణం నుండి అతను వాల్మీకిగా మారాడు. అనంతరం వాల్మీకి మహర్షిగా రామాయణంలో పోషించిన పాత్ర మనందరికీ తెలిసిందే!
మాటే మంత్రంగా పని చేసిన ఇటువంటి సంఘటనలు భగవద్గీత, బైబిల్, ఖురాను ఇతర మత గ్రంధాల్లో ఎన్నో వున్నాయి.
భగవద్గీత. 
శ్రీకృష్ణుడే ఆది కౌన్సిలర్  అని నాకు గట్టి నమ్మకం.  నిరాశ, నిస్పృహలలో ఉన్నవారిని మాటలతో ఉత్తేజపరచి, ఉత్సాహంగా కార్యోన్ముఖుల్ని చేయడం కౌన్సిలర్ పని. భగవద్గీతలో అటువంటి స్పూర్తి కలిగించే శ్లోకాలు ఎన్నో వున్నాయి. గీతలో సర్వయోగ సమన్వయం వుంది. సమత్వం వుంది. ధర్మాలున్నాయి. యుధ్ధరంగంలో అర్జునుడు చింతించు సమయంలో శ్రీకృష్ణుడు ధైర్యం చెప్తూ ఇలా ప్రారంభిస్తారు.
అశోచ్యానన్వశోచస్త్వం
ప్రఙ్ఞావాదాంశ్చ భాషసే!
గతాసూనగతాసూంశ్చ
నాను శోచంతి పండితాః
 (2వ  అధ్యాయం 11వ శ్లోకం )
"ఓ  అర్జునా!  నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి. ఙ్ఞానులైనవారు మరణించినవారి గురించిగాని జీవించి యున్నవారి  గురించి గానీ  ఎన్నటికీ దుఃఖించరు" అని ధైర్యం చెప్తాడు శ్రీకృష్ణుడు.  ఈ మాటలు అద్భుత మంత్రాల్లాంటివి.  జరిగిపోయిన వాటి గురించిగానీ అనవసరమైన వాటి గురించిగానీ ఆలోచించడం కూడా సమయం వృధా. పాజిటివ్ థింకింగ్ ఉన్నవారు అటువంటి వారిని విసర్జించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అటువంటివారే పండితులు అంటాడు శ్రీకృష్ణుడు. అటువంటివారే ప్రతిక్షణం ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే అదే సందర్భంలో
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణ సుఖ దుఃఖదాః
ఆగమాపాయినో నిత్యాస్తాం  సి
తిక్షస్వ భారతః
(2వ అధ్యాయం 14వ శ్లోకం )
      "ఓ అర్జునా!  ఇంద్రియములయొక్క శబ్ద స్పర్శాది విషయాలు ఒక్కో సందర్భంలో చల్లదనం,మరొకసారి దుఃఖం కలుగజేయును. వాటి రాకపోకలను సమబుధ్ధితో పంచుకోవాలి". ఈ శ్లోకంలో అద్భుతమైన కౌన్సిలింగ్ ఉంది. జీవితం ఎవ్వరికీ వడ్డించిన విస్తరి కాదు. సమయ సందర్భాన్ని బట్టి ఎవరికి వారే సమకూర్చుకోవాలి. ఆ సమయంలో కష్టాలు,నష్టాలు,సుఖాలు,దుఃఖాలు సంతోషాలు అన్నీ ఏకభావంతో భరించాలి. జీవితమన్నాక అన్నీ సుఖాలే వుండకూడదు. ఉంటే ఆ సుఖం విలువ తెలియదు. మధ్యలో కష్టాలుండాలి. ఆ కష్టం  తర్వాత  సుఖం అనుభవించినప్పుడు దాని విలువ  తెలుస్తుంది.  జీవితం CAKE WALK  లా ఉంటే సమస్యలొచ్చినప్పుడు తల్లడిల్లిపోతారు.  కాబట్టి సుఖ దుఃఖాలను సమ దృష్టితో  స్వీకరించాలనే ఈ శ్లోకం ఎంతో ఓదార్పు,ధైర్యం ఇస్తుంది.
ఇటువంటి మంచిమాటలు గీతనిండా వున్నాయి.  ఒక్క గీతే కాదు హైందవ గ్రంధాల్లో అడుగడుగునా ఇవి దర్శనమిస్తాయి.
బైబిల్: 
             బైబిల్ లో మాటే మంత్రంగా పని చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. యేసుమాట మంత్రంగా పని చేయటానికి ఆయనపై గల విశ్వాసమే మూల కారణం.  ఇక్కడ రెండు సంఘటనలు చదవండి.
"యెరూషలేములో గొర్రెం ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెసథ అనబడిన ఒక కోనేరు కలదు. దానికి అయిదు మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగినీళ్ళు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వారు ఎట్టి్వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు,గ్రుడ్డివారు, కుంటివారు,ఊబకాలు చేతులు గలవారు గుంపులుగా వుండిరి. అక్కడ ముప్పది ఏండ్లనుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి యుండుట జూచి వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలో వున్నాడని యెరిగి స్వస్థపడగోరుచున్నావా?అని వానినడుగగా అయ్యా! నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవరును లేరు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి పరుగెత్తుకొని నడువమని చెప్పగా
వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తుకొని నడచెను.
ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా! నీవు నీ పరుపెత్తుకొన దగదే అని స్వస్థతనొందినవానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థత పరచినవాడు నీ పరుపెత్తుకొని  నడువుమని నాతో చెప్పెననెను. వారు అట్లు చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవరో స్వస్థత నొందినవానికి తెలియలేదు. ఆ చోటును గుంపుకూడి యుండెను. గనుక యేసు తప్పించుకొని పోయెను.
యొహాను సువార్త – 5వ  అధ్యాయం.
ఆయన ఒక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠురోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూసి సాగిలపడి “ప్రభువా! నీకిష్టమైతే నన్ను శుధ్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యి చాచి వానిని ముట్టి నాకి్ష్టమే నివు శుధ్ధుడవు కమ్మని అనగానే కుష్టురోగము వానిని విడిచెను.  అప్పుడాయన నీవు ఎవ్వనితోను చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్ధమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుధ్ధుడవైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆఙ్ఞాపించెను.
లూకావార్త;5వ అధ్యాయం.
ఖురాను:
మహమ్మదీయుల పవిత్ర మత గ్రంధము  ఖురానులో శక్తివంతమైన సూక్తులున్నాయి.  కొన్ని గ్రహించండి.
178. మీరు మీ ముఖములను తూర్పునకో పడమటికో త్రిప్పుటయే ధర్మముకాదు. నిజమునకు అల్లాహ్ పట్లను దేవదూతల పట్లను పవిత్ర గ్రంధముల పట్లను ప్రవక్తలపట్లను విశ్వాసమున్నవారు (అల్లాహ్ పట్ల వున్న) ప్రేమతో తమ ద్రవ్యమును బంధువుల కొరకు, భిక్షకుల కొరకు బానిసలను (విడిపించుట కొరకు) చేయువారు, దానములు (జకాత్) చేయువారు తమ వాగ్ధానములను నిర్వర్తించువారు దారిద్ర్యమునందును అనారోగ్యమునందును యుధ్ధకాలమునందును ధైర్యస్థైర్యములుతో ప్రవర్తించువారును వీరే. పూర్ణవిశ్వాసులు, వీరే దైవభీతి గలవారు. తాము చేసిన ప్రతిఙ్ఞలను నిలుపుకొన్నవారు.
భాగము;సయాఖూల్-2.
103. ఓ విశ్వాసులారా! మీరు సర్వ విధముల అల్లాహ్ నిర్దేశించిన కర్తవ్యములను పరిపాలింపుడు. మీరు శరణాగతులై యుండునప్పుడు తప్ప మృత్యువు  మిమ్ములను గ్రహింపకుండుగాక!
104. మీరందరు కలసికట్టుగా అల్లాహ్ సూత్రమును పట్టుకొనుడు. మీలో మీకు విభేదములుండకూడదు. అల్లాహ్ మీకు చేసిన ఉపకారమును ఙ్ఞాపకముంచుకొనుము. మీరు శత్రువులుగా వున్నప్పుడు అతడు మీ హృదయాలను ప్రేమతో ఏకమొనర్చును. అతని అనుగ్రహముతో  మీరు సోదరులైరి.  మీరు అగ్నిగుండము అంచున నిలిచి వున్నప్పుడు అతను మిమ్ములను రక్షించెను. ఈ విధముగనే అల్లాహ్ తన సూక్తులను మీ మార్గధర్మము కొరకు తెలియజెప్పును.
105. మీలో కొందరు ఒక సంఘముగా యేర్పడి ప్రజలను ఉత్తమత్వము వైపు ఆకర్షించి ఉత్తమత్వమును నేర్పి దౌష్ట్యము నుండి దూరంగా వుండునట్లు చేయవలయును. ఇట్టివారికే విజయము చేకూరును.
106. స్పష్టమైన నిరూపణములు అందిన తర్వాత కూడా తమలో తాము కలహించుకొని విడిపోయినవారివలె వ్యవహరింపకుము. ఇట్టివారికి కఠిన శిక్ష (విధింపబడి) యున్నది.
-భాగములనుతనలూ 4.
ఆద్యంతమూ చదివించే పవిత్ర ఖురాను లో ఇటువంటి సూక్తులెన్నో వున్నాయి.
లెండి ......... మేల్కొండి ...
స్వామి వివేకానంద అందించిన మంత్రాల్లాంటి మాటలు గ్రహించండి.
"బ్రతికినా ,చచ్చినా మీ స్వంత శక్తిమీదనే ఆధారపడండి.  ఈ ప్రపంచంలో "పాపం" అనేది ఏదైనా ఉంటే అది బలహీనతే. బలహీనతను విడిచిపెట్టండి. అది మరణానికి దారి తీస్తుంది. బలమే జీవితం. బలహీనతే మరణం. నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ అనుకోవద్దు. చెప్పుకోవద్దు. మీలో వున్న అసాధారణమైన శక్తి గురించి మీకు తెలిసినది చాలా తక్కువ. మీ వెనుక అనంతమైన శక్తి వుంది".
"ఓ  యువతా!  మేలుకో! మీ శక్తిని తెలుసుకోండి. దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం  మీరు నీర్వీర్యులు అవుతారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా మూఢనమ్మకం భయమే. భయమే మన దుఃఖాలన్నిటికీ ఏకైక కారణం. ధైర్యం జీవితంలో అద్భుతం చేయగలదు. కాబట్టి లెండి, మేల్కొండి. గమ్యాన్ని చేరే వరకు ఆగకండి".
మంచిగా ఉండటం-మంచి చెయ్యడం  ఇదే మతం బోధిస్తుంది. 
బౌధ్ధమతం, సిక్కుమతం.... ఇలా ఏ మతగ్రంధం చదివినా మంత్రాల్లాంటి మాటలు అడుగడుగునా ఉన్నాయి. అవి చదివి  పాటించి విజయం సాధించినవారు ఎందరో వున్నారు.
ఈ రోజు ప్రపంచంలో ఏ మూల చూసినా అశాంతి, అసూయలు విలయతాండవం చేస్తున్నాయి. పగ, ద్వేషాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య  వైషమ్యాలు శృతి మించుతున్నాయి. అన్నదమ్ముల్లా బతకాల్సినవారు ఒకరిపై ఒకరు ఆటంబాంబులు విసురుకుంటున్నారు. రెండు దేశాలమధ్య గల అంతరాలు, అమాయకుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఈ పరిస్థితిని చక్కబెట్టేది కేవలం ఒక మాట మంత్రమే. ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెను హాకింగ్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు.
"The World's problem could be solved if we kept talking".
సామరస్య వాతావరణం కావాలంటే సంభాషణలే మార్గం. ఆ చర్చలు ఫలవంతమైతే అంతా ఆనందమే. కమ్యూనికేషస్ వలన సమాజం బాగుపడుతుందనీ, వ్యక్తుల మధ్య అంతరాన్ని తగ్గించవచ్చనీ అందరికీ తెలుసు. కాని ఎంతమంది ఇది పాటించగలుగుతున్నారనేదే ప్రశ్న. మన నీత్య జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని మౌనంగా భరిస్తూ ఆరోగ్యం పాడుచేసుకొని, నిద్రకు దూరమవటం అవివేకం. వివేకానందుడు ఆదేశించినట్లు "మేలుకో" అనే ఆఙ్ఞను స్వీకరించి మన సమస్యలను  మనమే పరిష్కరించుకొని   మన జీవితం, మన సంసారం, మన వ్యాపారం, మన సంబంధ-బాంధవ్యాలు  అభివృధ్ధి పరచుకుందాం.
దానికి అవసరమైన చిట్కాలు ఇందులో అడుగడుగునా ఉన్నాయి.
మాటలు మంత్రాల్లా పనిచేస్తాయనేది అక్షరాలా సత్యం.  అమృత ఫలాల్లాంటివి. అయితే ఫలాల్లో కూడా చాలా మంచివి, పుచ్చిపోయినవి ఉంటాయి. కాబట్టి మంచివాటిని ఎన్నుకోండి. వాటిని భాషలో పెట్టండి. భాషను కూడా శృతిమించి ప్రయోగించకండి. శ్రీ సత్యసాయిబాబా భక్తులకు భాష గురించి చెప్తూ ఇలా అన్నారు.
 "మిత భాష అతిహాయి
అతి భాష మతి హాని".
కాబట్టి భాషను మితంగా ఉపయోగించి, మృదువుగా మాట్లాడుతూ విజయం సాధిద్దాం, రండి.

No comments:

Post a Comment

Pages