ఎసరూ - అత్తిసరూ   
 బి.వి.ఎస్. రామారావు


'జీవితాన్ని సాహిత్యంగా రాయడం పచ్చిపాలలోంచి వెన్న తియ్యడం లాంటిది. ఒక మంచి కధ రాయడానికి ఎంతో సత్తా, ఇంకెంతో మంచితనం ఉండాలి. మనిషి ఒక ప్రాంతానికి చెంది అక్కడి గాలి పీల్చి , అక్కడి నీళ్ళు త్రాగి తన బ్రతుకు పండించుకుంటాడు. అలా బ్రతుకుల్ని పండించుకున్న కధలిలాగే గోదావరి కధల్లా ఉంటాయి. బంతిపూల తోటలో పరికిణీలు కట్టుకున్న చిన్నారి పొన్నారి కన్నారి ఆడపిల్లల్లా ఈ కధలు మీ మనస్సులో చిట్టిపొట్టి అడుగులేసి ఆడుతాయి. ' ~ పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఎసరూ ~ అత్తిసరూ  గోదావరి గట్టు. ఆ గట్టు నానుకుని ఒక వీధి. ఆ వీధిలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే ఒక బామ్మగారు. ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు. ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు. నాలుగురోజుల ముసురు తర్వాత తొలిపొద్దువేళ. 'వర్ధనమ్మగోరూ ! వర్ధనమ్మగోరూ !' ఇంకా పూర్తిగా తెల్లారకుండానే ఎవరిదో పిలుపు. "మీ బామ్మగారి నెవరో పిలుస్తున్నట్టున్నారు " అంటూ భర్తను లేపింది కమల. "అబ్బా! నువ్వే లేపవే " ఒళ్ళు విరుచుకుని ముసుగు మరింత బిగించాడు భాస్కరం. "పరగడుపునే బోడి మొహం ఎలా చూడనండి ? మీరే లేపండీ ." పెంచి పెద్దచేసి ఓ ఇంటివాడిని చేసిన బామ్మను నిన్నగాక మొన్నొచ్చిన ఇల్లాలు బోడిమొహం అన్నందుకు మనస్సు చివుక్కుమంది భాస్కరానికి. "వర్ధనమ్మగోరూ ! వర్ధనమ్మగోరూ !" "ఎవరువారూ " అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి.  తన స్థూల కాయాన్ని అదుపులోకి తెచ్చుకుని కిటికీకేసి జరిగి చిడతను తప్పించి ఓ రెక్కను మెల్లిగా తెరచింది వర్ధనమ్మ. కిటికీకి అడ్డు తగిలి “మామ్మగోరూ “ అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు. “ఓరి నువ్వట్రా సత్తిగా.” “అదేంటి మామ్మగారూ ఇంకా తొంగున్నారు. లెగండి గోదారి పొంగేసినాది. వడి మంచి పోటుగా ఉంది.” “ఒరే పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా గోదాట్లో.” “అందుకే కదమ్మా నేనొచ్చింది. జాలరిపేట జనమంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు. సుక్క పొడవకుండా ఆరు నేరేడు దున్గల్ని, మూడు మద్ది దూలాల్ని అంకాలమ్మ రేవు కాడికి సేరేశారు. తుమ్మ మోళ్ళ సంగతి సెప్పనేక్కర్లేదు. బొడ్డూడనికుర్రనాయాళ్ళు సైతం కర్రకి దొంకిణీ కట్టి లాగేత్తున్నారు” గోదావరికి వరదలొస్తే చాలు వర్ధనమ్మకి కాళ్ళు నిలపడవు. వరదలో కొట్టుకువచ్చే కంప, కలపనీ, ఈది పట్టుకోవడానికి కూలీల్ని పురమాయించి యెడాదికి సరిపడే పంటచెరుకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో, మాగాయి పచ్చడో వేసి కూలీలకి పెట్టడం, వళ్ళు ఈది పట్టిన దుంగల్ని గట్టుకు చేరేయ్యడం, వాటిని నరికించి పెరెట్లోకి సర్ధించడం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం. కిరాయి ఎంత ఇస్తే అంత పుచ్చుకోవడం కూలీల  రివాజు. "నాకసలు డబ్బే వద్దు, సందేళే మరోసారి వేడిగా పట్టెడన్నం పెడితే చాలు" అనే వాళ్ళలో సత్తిగాడొకడు. "మామ్మగారూ ! అన్నం యేడిగా వండండి. మాగాయి  పచ్చడి వద్దే  చేయండి. తినేసి గోదారంతా ఈదేత్తాను. ఈలోగా రేవుకాడకెళ్ళి కాత్త పుక్కుళించి వచ్చేత్తాను. ఈ ఏడు చింత, తుమ్మ కాకుండా టేకు, ఏగిన మీ పొయ్యి లో మండాల" అంటూ మెరుపులా మాయమయ్యడు సత్తిగాడు. నాలుగు రోజులుగా ముసురు మరుగున పడి పొద్దు నియమంగల తనని పస్తులు పెట్టిన సూర్యభగవానుణ్ణి కోపంగా చూసి  వాలాయితీగా ఓ దండం పెట్టి గుడి కేసి తిరిగి శిఖర దర్శనం చేసుకొని, ఆ చేత్తోనే మరొ దణ్ణం పెట్టి కార్యాచరణ కుపక్రమించింది వర్ధనమ్మ. * * * * * * * నీళ్ళ పొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తున్న కమల గుమ్మంలోనే ఆగిపోయింది ఆశ్చర్యంగా.  ఇన్నాళ్ళూ చిందర వందరగా వున్న పెరడు అద్దంలా అలకబడి వుంది. నీళ్ళ పొయ్యి మీద కుంచం గిన్నెలో ఎసరు మరుగుతోంది. వర్ధనమ్మ కూనిరాగాలు తీస్తూ మానెడు బియ్యం ఎసట్లోకి దేవుతోంది. "నాలుగు రోజుల ఉపవాసం బాపతు తిండి ఇప్పుడొక్క సారే లాగించేస్తోంది కామోసు ఈవిడ". అని దవళ్ళు నొక్కుకొని చటుక్కున గదిలోకి వెళ్ళిపోయింది కమల. నీళ్ళకోసం పందుంపుల్లను నవుల్తూ పెరట్లోకి అడుగుపెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపోయాడు - బామ్మ ఇంత పెందరాళ్ళే స్వయం పాకం లోకి దిగినందుకు. "అవును పాపం. నాలుగు రోజులుగా పస్తుంది.  ఆకలి వేయదూ  మరి" అని జాలి పడి "బామ్మా! అసలే నీరసించి పోయావు. ఇవ్వాళ కూడా స్వయంపాకం దేనికీ. కమలచేత మడిగట్టించి ఇంత అత్తిసరు వేయించుకోకూడదా? ఎంతని కష్టపడతావు" అన్నడు. ఈ మాటలు విన్న కమల అదిరిపడింది. చలిలో తాను ఎక్కడ తల తడుపుకోవలసి వస్తుందోనని. పైగా ఆ కుంచం గిన్నె తనెక్కడ వార్చాలోనని మొగుడి పురమాయింపులకు చివాట్లు వెయ్యడం కోసం "ఏవండీ! రండి, కాఫీ చల్లారిపోతోంది"  అని కేకేసింది కమల - ఇంకా కుంపటి కూడా అంటించకుండానే. "మామ్మగోరూ!" అంటూ రెండు బారల అరిటాకుతో సహా పెరట్లో సిద్ధమయ్యాడు  సత్తిగాడు. "ఒరే ఒక్క నిమిషం కూర్చో, అన్నం వారుస్తాను" అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ. మరుక్షణంలోనే మాగాయి పచ్చడితో పాటు సెగలు కక్కుతున్న వేడి వేడి అన్నాన్ని గిన్నెలో  సగానికి పైగా విస్తట్లో గుమ్మరించింది. ఆవిరి సెగకు ముఖం దగ్గరగా వుంచి అన్నం బాపతు ఘుమఘుమని ఒక్కసారి పీల్చి ఆవురావురుమంటూ ముద్దను నోట్లో కూరుకొని "మామ్మగారూ! మీ చేతి ముద్దకోసం గోదారితల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసుక్కూచున్నాను"  అన్నాడు డెక్కుతూ. "ఒరేయ్! నెమ్మదిగా తిను, ఇంకా కావలసినంత వుంది" అంటూ నీళ్ళచెంబు సత్తిగాడి పక్కన వుంచి వాడికెదురుగా చతికిలబడింది. సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుకు లాగించేస్తున్నాడు. "ఆ కరుడలా పక్కకు లాగు. ఇంకాస్త అన్నం వడ్డిస్తా" అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చడి మారొడ్డించింది  వర్ధనమ్మ. సత్తిగాడు ఆకు మధ్యకు అన్నాన్ని తాపీగా దేవుకొని, మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లోకి దిగాడు. "అదేమిట్రా, అన్నం పారేస్తావ ఏమిటి?" "సచ్చినా పారేయ్యను. ఈ రుచి సానాసేపు నాలిక మీద వుండాలని నెమ్మదిగా తింటన్నానమ్మా" "ఒరేయ్ భుక్తాయాసంగా ఉంటే అరుగుమీద కూర్చొని కాస్సేపు పోయాకే వెళ్ళి ఈదు. పుల్లలు ఇవ్వాళ కాకపోతే రేపేరుకోవచ్చు". "తిండానికి నాకాయాసమేటి తల్లీ! ఇంకో ఇంత తినెయ్యగలను. ఆ సత్తు గిన్నెలో ఏముంది?" "వార్చిన గంజిరా" "అదికూడా ఇల్లా ఇచ్చేయండి. కాసింత ఉప్పేసుకొని  తాగేత్తాను". "మా నాయనే, మా నాయనే. ఉండు ఉప్పు తెస్తాను". అంటూ భారంగా లేచి వంటింటికేసి వెళ్ళింది. వంటింటి వసారాలో కమల ఏం వండాలో తేల్చుకోడానికి కూరగాయల బుట్ట ముందేసుకుంది. అందులో రెండరటికాయలు దోరగా మగ్గున్నాయి. "ఇవి ముసలావిడ కంటపడితే ఏ దారినపొయ్యే దానయ్యకో ఇచ్చేస్తుంది"  అని భయపడి ఆ రెండు బొంతరటి పళ్ళూ చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది. వర్ధనమ్మ కాళ్ళీడ్చుకొంటూ   వంటింట్లోకి వచ్చి జాడీలో చెయ్యి పెట్టింది. చేతికి మెత్తగా ఏవో తగిలితే తీసి చూసింది. అవి బొంతరటి పళ్ళు. "సత్తిగాడు ఇంకా ఆకలితో ఉన్నాడు. వాడికిప్పుడోటేసి మరోటి సాయంత్రం పెట్టొచ్చు. అయినా ఇవి ఈ ఉప్పు జాడీలో పడేసుకుంటారా, తెలివి" అని విసుక్కొని ఓ పండు పుచ్చుకొని మరో పండు బియ్యం డబ్బాలో పడేసి చారెడుప్పు తీసుకొని పెరట్లోకి నడిచింది. సత్తిగాడు ఆఖరి ముద్దకు రాగానే "ఒరేయ్ ఇది కూడా తిను" అంటూ బొంతరటిపండుని విస్తట్లో పడేసింది. "బొంతరటిపండే. అయ్యబాబోయ్ ఇదంటే నాకెంతో ప్రాణం" అంటూ దాన్నందుకున్నడు సత్తిగాడు. "ఒరేయ్ సత్తిగా, ఆయనక్కూడా ఇదంటే ఎంతో ఇష్టం రా" "ఎవర్కండీ, భాస్కరం బాబుకా?" "కాదురా ఆయనా". "హో. పోయిన పెద్దాయనా?" "ఛ. నీ మొహం. ఆయన పెద్దాయనేం కాదు. చాలా చిన్న వయస్సు" "నా వయస్సుంటదాండి" "నీ వయస్సు పాతిక వుండదూ? నీ కన్నా నా నాలుగేళ్ళు తక్కువే! కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు." ఇంత ముసలావిడకి అంత చిన్నోడితో పెళ్ళేంటి అనిపించింది. "ఆరు మిమ్మల్ని బాగా చూచుకునేవారా" అని పరామర్శించాడు. "వద్దమ్మా. ఆ ఉప్పు కాత్త గంజిలో యేసేయ్యండి తాగేత్తాను." గంజి గిన్నె ముందుకు నెట్టింది. గిన్ని చప్పరిస్తూ "మామ్మగారూ!ఎన్నళ్ళకో ఇలా కడుపునిండా తిన్నా. ఇయ్యాల చూడండి గోదారంతా గాలించి మీ జన్మలో యింక పుల్లల్ని కొనక్కర లేకుండా చేత్తాను" అంటూ గంజిని గడ గడ తాగేశాడు. "ఏరా, మీ అమ్మ కూడు సరిగా పెట్టడం లేదేమిట్రా?" "ఇంకెక్కడమ్మ తల్లీ! నన్నీదిలో పడేసి పోయింది." "మరి నువ్వెక్కడుంటున్నావు?" "పైడమ్మతో." "ఎవరూ! ఆ పిడకలమ్ముకొనే పైడమ్మా? దాన్ని చేసుకున్నావా?" "పుల్లలు కొట్టుకు బతికేవోణ్ణి, నాకు పెళ్ళేంటండి. అది నన్నుంచుకుందండి" అన్నడు సిగ్గుతో. "ఓరినీ! నీకన్నా రెట్టింపేళ్ళుంటాయి దానికి. ఇదేం పొయ్యే  కాలం రా?" "ఉప్పు జాడీ కోసం వెళ్ళింది ముసల్ది, అరటిపళ్ళు కాజేసిందేమిటి చెప్మా" అని జాడీలో చెయ్యెట్టి తడిమింది కమల. అనుకున్నంతా జరిగినందుకు దీని శిగతరగా అనుకొని దీని శిగ ఎప్పుడో తరిగేశారుకదా అని గుర్తొచ్చి మనసులోనే మరేవో తిట్టుకొంటూ, అత్తిసరుకు బియ్యంకోసం బియ్యపు డబ్బాకేసి తిరిగి దానికి మూత లేకపోవడం చూసి, "అసలే ఇల్లంతా ఎలకలమయం. ఈ ముసల్ది మూతలన్నీ గడియ గడియకీ తీసి పడేస్తుంది" అంటూ డబ్బాలో చెయ్యెట్టి, ఏదో మెత్తగా తగిలితే, అది కదిలినట్టుగా భ్రమ కలిగి, ఎలకేమోనని భయపడి, కెవ్వున కేకేసి, ఎగిరి గంతేసింది కమల. కమల కేక విన్న భాస్కరం, వీధి అరుగు మీంచి వంటింటి వసారాలోకి ఎకాఎకి దూకాడు. వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది ఏమైందర్రా అంటూ. భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ కంగారు పడిపోతున్నాడు. భాస్కరం కంగారు చూసి, "ఏమిట్రా, చీంబోతులా, ఏమైందంటే పలకవే" అని గొంతుకు చించుకొంది బామ్మ. బామ్మ చీంబోతు అన్నందుకు కాదు గానీ, పెళ్ళాం విన్నందుకు కోపం వచ్చింది భాస్కరానికి. చిరాకు ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా, వంకలేనమ్మ, డొంకట్టుకు వేళ్ళాడినట్టు, "ఏమిటి బామ్మా, అడ్డగాడిదలందర్నీ పిలిచి సంతర్పణ చేస్తున్నావు.  దున్నపోతులా ఉన్నాడా సత్తిగాడు, వాడికి వండి ఎందుకు వడ్డించావు?" అని కేకలేశాడు భాస్కరం. "వాడేం అప్పనంగా తింటంలేదు గదట్రా, కూలి డబ్బులు బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదాట్లో ఈది మనకి ఏడాది పొడుగునా సరిపడే వంటచెరుకు లాక్కొచ్చి పడేస్తునాడాయిరి." "అయినా రూపాయి పడేస్తే బండెడు పుల్లలొస్తాయి. వాటికోసం ఈ ఎడ్డిచాకిరీ ఎందుకు మధ్య?" "రూపాయితో పేడు కూడా రాదురా నాయనా! నువ్వు కొనడం మొదలెడితే ఇంతోటి నీ రెండొందల జీతం పుల్లలకే సరిపోదు." "ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా యింటా వంటా లేదు" అని దెప్పి పొడిచింది కమల. ఆ మాటలు విన్న భాస్కరానికి మరింత అహం తలకెక్కి "చెప్తే వినవూ. నీకు తోచదు. కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనచ్చులే" అంటూ విరిచుకు పడ్డాడు. "నే పొయాకలాగే చేద్దువుగాన్లే నాయనా!" అంటూ వీధిలోకి నడిచింది వర్ధనమ్మ. వర్ధనమ్మకు  మనస్సు కష్ట పడినప్పుడల్లా రేవు కేసి వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చొంటుంది. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సును కుదుట బరుస్తుంది. అలా ఎన్నో ఏళ్ళుగా భరింపలేని కష్టాల నెదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా ఆ గోదావరే ఇచ్చింది. పొద్దుట్నించీ వంట చెరుకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరాన పడడడంతో మరింత అలసి తులసికోటకు జేరపడింది వర్ధనమ్మ. ఎసట్లో తనకో గిద్దెడు బియ్యం పడేసుకోడానికి కూడా ఓపిక లేకపోయిందావిడకి. "వర్ధనమ్మగోరూ!" అంటూ పెరటి తలుపు తట్టింది పైడమ్మ. "తర్వాత రావే మడికట్టుకున్నాను" "తెల్లారనగా పోయాడా సత్తిగాడు. నాలుగు రోజులనించి లంఖణాలతో మంచానికంటుకుపోయినోడు. నిన్న రాత్రే కాత్త జొరం తగ్గి మణిసయ్యాడు.” ఆ మాటలు విన్న వర్ధనమ్మ సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేక చెవులప్పగించి వూరుకొంది. "మామ్మగారి కాడకెళ్ళి కాసింత ఊరగాయ పట్రావే, నోరు చేదుగా వుంది అని రాత్రంతా ఒకటే గోలెట్టాడమ్మా. ఈడక్కని వచ్చాడా అని సూసిపోడానికొచ్చాను. కాసింత ఊరగాయ పెట్టు తల్లి. మళ్ళా వత్తాను." అని వెళ్ళిపోయింది పైడమ్మ. "అన్నప్రాసననాడే అర్ధశేరు బియ్యం తినిపించినట్టు పత్యం రోజునే అడ్డమైన తిండీ వాడిచేత తినిపించాను. వాడికేం బెడసికొట్టదు కదా" అని కాస్త ఇదయింది వర్ధనమ్మ. "నాకా విషయం ముందుగా తెలిస్తే కదా బాధ పడవలసింది" అని సరి పెట్టుకుంది. తన చేతి పట్టెడు మెతుకుల కోసం ఇన్ని లంకణాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదడానికి సిడ్ఢమైనాడు, పాపం అని జాలి పడింది. "ఓపిక లేకపోతే వాడు ఎందుకు ఈత్తాడు. నాకు ఢోకాయిచ్చి ఎక్కడో ఊరేగుతూ వుంటాడు, చచ్చినాడు" అని నిర్ధారణ చేసుకుంది. "వెర్రిబాగులాడు నిజంగా ఈదడానికి పోయాడేమో అప్రదిష్ట" అనుకొని అనుమానం పడింది. ఆ అనుమానం కాస్తా భయంగా మారింది. ఏదో కీడు శంకించి ఆందోళన పడసాగింది. సత్తిగాడు గోదావరి ఒడిలో ఎదురీదడం, దూకుడుగా వస్తున్న దుంగను పట్టుకోవడానికడ్డుపడ్డం, అమాంతం నీరసం ఆవహించి ఈద లేకపోవడం, దుంగ బలంగా సత్తిగాడిని ఢీ కొట్టడం, ఆ దెబ్బతో శోషొచ్చి వాడూ నిలువునా మునిగిపోవడం, ఈ చావుకు కారణం నువ్వే అంటూ వూరంతా నిలదీయడం, పైడమ్మ శపనార్ధాలు, భాస్కరం కమలల దెప్పి పొడుపులూ వంటి వూహలు మనస్సులో పదే పదే తరంగాల్లా మెదలసాగాయి. "వాడు నిజంగా ఈతకెళ్ళాడేమో పాపం.  వాడిని ఆపకపోతే నిష్కారణాంగా ఓ నిండు ప్రాణాన్ని తీసిన దాన్నవుతాను" అని కంగారుగా వున్న ఓపికను కూడగట్టుకుంటూ పెరటి తలుపు తీసి గోదావరొడ్డు కేసి నడచింది. కుండపోతగా కురిసిన వర్షానికి అడుసుదిబ్బలా తయారైన గట్టు మీద కాలు తీసి కాలేయ్యడమే కష్టంగా వున్నా, గోదావరంతా కలయజూస్తూ బరువుగా శరీరాన్ని గట్టమ్మట నడిపించసాగింది వర్ధనమ్మ. గోదావరిలో కొన్ని వందల మంది పుల్లల కోసం ఈత్తున్నారు. ఎవడ్ని చూసినా సత్తిగాడిలాగే కనపడ సాగాడు వర్ధనమ్మకి. 'సత్తిగా' అంటూ గొంతుకు చించి అరుచుకొంటూ సత్తిగాడి కోసం దేపురించింది. అలా గంటలు గడిచాయి. సత్తిగాడెక్కడా కనపడలేదు. వాడు గోదాట్లో మునిగి పోయాడని నిర్ధారణ చేసుకొంది. సర్వం కోల్పోయిన దానిలా, నిస్పృహ, నిరాశ, ఆవరించి తిరుగు ముఖం పట్టింది. గోధూళివేళ కావస్తోంది. పొద్దు వాలపోతోంది. బామ్మగారి నవనాడులూ పట్లు తప్పాయి. నోరు పిడచకట్టుకు పోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చాయి. మనసు మనసులో లేదు. "మామ్మగారూ! చూశారా ఎంత పెద్ద మద్ది దుంగని పట్టుకున్నానో" అన్న సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్ధనమ్మ. నవ్వుతూ తనవైపుకు వస్తున్న సత్తిగాడ్ని కన్నీటి పొరకుండా చూసింది. నవనాడులూ జలదరించాయి. సంతోషం, దుఃఖం ఒకే సారి ఉప్పెనలా పొంగాయి. బరువైన దిగులు, దూది పింజలా ఎగిరిపోయింది. మనస్సు తేలిక పడింది. వణుకుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరింది. "ఏమైందే బామ్మా" అంటూ అరుగు దిగాడు భాస్కరం. "మామ్మగారూ! మీరు బేగా యేడన్నం పెట్టాలి. నేనీలోగా ఈ చిన్న పేళ్ళను నరికేత్తాను" అన్నాడు సత్తిగాడు. తల ఊపి, కొంగుతో కళ్ళనీళ్ళొత్తుకుంటూ యాంత్రికంగా పెరట్లోకి నడిచింది. "అయ్యగోరూ! ఈ దుంగిస్తే షావుకారు రెండొందలిస్తానని అటకాయించబోయాడు. బామ్మగారి చేతి వణ్ణం ముందు అదో లెక్కా?" పేళ్ళను నరికి, కుప్పగా పోగేసి చెమటొత్తుకొంటూ పెరటి గుమ్మం కేసి నడిచాడు సత్తిగాడు. పెరట్లో తులసికోట వారే చెంగు పరచుకొని పడూకొంది వర్ధనమ్మ. పొయ్యి మండుతోంది. ఎసరు అత్తిసరై ఇగిరి మాడుతోంది. "మామ్మగారూ!" అని పిలిచాడు సత్తిగాడు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ మళ్ళీ పిలిచాడు. గంగా భాగీరధీ సమానురాలైన పర్వత వర్ధనమ్మ శాశ్వతంగా కన్ను మూసిందని ఇరుగుపొరుగు వారు నిర్ణయించినదాకా సత్తిగాడు కానీ, భాస్కరం కానీ నమ్మలేదు. ఆనాడు జేబులో పైసా లేని భాస్కరంగాడి చేత ఆ దుంగనమ్మగా వచ్చిన రెండొందలతో సత్తిగాడు కొట్టిన కట్టెపేళ్ళే చితిని పేర్పించాయి అంత్యక్రియలకి.
(గమనిక : రచయత మా పెద్ద మావయ్యగారు. వారి అనుమతితోనే ఈ కధ ప్రచురించడం జరిగింది.)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top