భావము – భాష - అచ్చంగా తెలుగు

భావము – భాష

Share This
భావము – భాష
- శ్రీనివాస్ యనమండ్ర

భాష పరిశీలించెదరు భావముతో సమానముగ సుసాహితీప్రియుల్
భాష భావమునకు వన్నెచిన్నెలిచ్చును పలువిధములనటంచున్
భాష మనోభావావ్యక్తీకరణకు తొలిమెట్టని తలంతురే వారెల్లవేళలన్
భాష, భావాల కలయికే వ్యక్తిత్వనిర్మాణమునకు నాందియనుచున్
జంతువులన్నిటిలోనూ మానవులుకున్న ఒక అద్భుతమయిన వరం - భావ వ్యక్తీకరణకు అణుగుణమయిన రీతిలో సంభాషించుకోగలగటం. మనసులో భయం, ఆందోళన, ఆనందం, ఆకలి, సరసం ఇత్యాది భావాలు ప్రతి జంతువులోనూ అగుపించేవి అయినా, ఒక్క మానవులకి మాత్రమే వాటిని తనకి ఇష్టమయిన రీతిలో ఇతరులకు తెలిపే అవకాశం కల్పించిన అద్భుతమయిన వరం – భాష.
నిత్య జీవితంలో ప్రతీ ఒక సంఘటనా మన మనసులో చెరగని ముద్ర అంతర్లీనముగా వేస్తాయి. ఆ ముద్రలు కాలక్రమేణా మనలో భావాలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ భావాలు మనలోని వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. మన వ్యక్తిత్వం మనకి జీవితంలో ఒక స్థాయి కల్పిస్తుంది. కాకపోతే ఈ పరిణామక్రమం చెప్పిన విధముగా సాఫల్యం కావాలంటే, మనసున వున్న భావాలు నలుగురికీ వ్యక్తపరచగలిగే నైపుణ్యం కలిగి ఉండటం అవసరము. భావము వ్యక్తపరచలేని వ్యక్తిలొని గొప్పతనం గుర్తించటం సామాన్యులకు చాలా కష్టమయిన విషయం. లొకములో అత్యధికులు ఈ సామాన్య మానవుల కోవలోకే చెందుతారు. అందుకే అనన్య సామాన్యమయిన మేధావులనబడేవారు కూడ వారి భావాలు వ్యక్తపరచటానికి సరియగు భాషకోసం నిత్యం పరితపిస్తూనే ఉంటారు.
ఈ రీతిన చూస్తే భాష వలన ప్రాధమికమయిన ఉపయోగము ఒకరి భావాలు ఇంకొకరికి చేరవేయడమే. కాకపోతే ఆ చేరవేతలోని నైపుణ్యం ఒక మనిషికీ వేరొక మనిషికీ మధ్యగల పరిణితిని సూచిస్తుంది. ఆ పరిణితి సాధించదలచిన ఉత్సాహం మనలో కలిగినపుడు మనకు అండగా నిలబడునది, తరతరాలుగా మన సమాజ దర్పణముగా నిలుస్తున్న మన సాహిత్యము. వివిధ రకాల సాహితీ ప్రక్రియల ద్వార భావము బయల్పడు అనేక భాషా ప్రయోగాలు మనకి ద్యోతకమగును. అట్టి పలు ప్రక్రియల ఎడల ఉత్సాహ భరిత భావన ఏర్పర్చుకోవాలనే తపన ఎంత చిన్న వయసులో కలిగిన అంతటి అదృష్టము.
కాకపోతే, మనుషుల అలంకరణలలో వైవిధ్యమున్నట్టే, వివిధ సాహిత్య రచనలలోని భావప్రకటనా సౌందర్యము అందులో వాడబడిన భాషవలన, దానికి అద్ధిన చందో వ్యాకరణ సొబగులవలన వేరు వేరు పుంతలు తొక్కుతుంది. గల గల పారు సెలయేరు హోరు భాష వాడువారు ఒకరయితే. హృద్యముగా హుందాగా చెప్పగలిగిన నేర్పు కలవారు మరికొందరు. భక్తిభావనలపై శ్రధ్ధ తీసుకు రావలెనన్న సంకల్ప సిద్ధి ఒకరి భాష వలన సాధ్యమయితే. మనోనిబ్బరమే ఆత్మ సాక్షాత్కార మార్గమని నమ్మించగల మాటలు వాడు ప్రజ్న వేరొకరి రచనలది. సనాతనము ఉన్నతమనె వాదము సల్పు భాష ఒకటైతే, ఆధునికతకు సాటిలేదన్న భావనకుపయోగపడు భాష ఇంకొకటి. సరసానికి పీట వేయు శబ్దాలు ఒకరివైతే, అటువంటి రచనల తాట తీయు పరాక్రములు వాడు పదజాలము వేరొక రీతి. ఈ విధముగ, భాష, దానిని వాడు విధానము - పలు భావాలకి సంగమస్థలిగా మారుతుందనటులో అతిశయోక్తి లేదు.
ఇంత వైవిధ్యభరితమయిన ఉపయోగాలు గల భాషయొక్క నిజమయిన లబ్దిని పొందదలచిన పాఠకునికి ఉండవలసిన ముఖ్య లక్షణం “నిర్వికార భావం”. గుండె కదిలించు రచనలే కానీ, పెదవిపైన చిరునవ్వు పలికించు కవితలేకానీ, కొత్త విషయాలు తెలియచేసే వ్యాఖ్యానాలు కానీ, ప్రేమభావాన్ని వెదజల్లు చిరుజల్లులే కానీ, భక్తిసౌరభాలు గుభాళించు ప్రస్తావనలే కానీ, మోక్ష సాధనకు దోహదపడు అంశాలు కానీ – ఏవైనా కానీ ఒక సునిశిత పాఠకుడు, రచయిత చెప్పదలచుకున్న భావానికి, అతడెంచుకున్న భాషకీ మధ్యన గల ఒక అవినావభావ సంబంధాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. తనను కదిలించిన రచనలో తనని ప్రభావితం చేసిన అంశం యొక్క శక్తి ఆ రచయిత భావానిదా, లేదా రచయిత వాడిన భాషదా అన్న దృష్టిలో తన అలోచనా సరళిని నిలుపుతాడు. దీనివలన అతను, వివిధ రకాలయిన భావలకు అతీతుడై, వాటిని వ్యక్తపరచు భాషలోని సౌందర్యారాధాకుడిగా మారతాడు. దానివలన భావముతో సమానముగా అతనికి భాషమీద, భాషను మరింత సుందరముగ వెలుబుచ్చే అనేకరకాల సాహితీ ప్రక్రియల మీద ఉత్సాహము పెరుగుతుంది.
అలాంటి నిజమయిన సాహితీ ప్రియుడు, తన నిజజీవితములో కూడ, భావాల పట్ల చంచల స్వభావము లేక మనిషికీ మనిషికీ మధ్యన తేడా వాటి వ్యక్తీకరణలోనే అని నమ్ముతాడు. ఆ నమ్మకానికి చేరువయిన నాడు, ఆ పాఠకుడు ప్రతి మనిషినీ సమానమైన భావమిశ్రమాలు కలిగినవానిగా చూచుచూ, వారు భావాలు వ్యక్తపరచుటకు ఉపయోగించే భాష సరియగునది కాని కారణమున వారు పడు బాధలు గూర్చి విశ్లేషిస్తాడు. ఈ విశ్లేషణ అతనికి తన భావప్రకటనా సమయములో తగిన విధముగా ఉపకరించి  - తగిన భాష, దానిని వాడు విధానము, తెలుసుకుని సుభాషితములగు మాటలు పదిమందితో పంచుకుంటూ నలుగురి మన్ననలూ పొందుతాడు.
సాహిత్యాభిలాష పెంచుకున్నవారు ఈ భావ-భాష సమన్వయమును జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించు సాధకులుగా మారతారనేది నా ప్రగాడ నమ్మకం.

No comments:

Post a Comment

Pages