అప్పడుండే కొండలోన (అన్నమయ్య కీర్తనకు వివరణ) - అచ్చంగా తెలుగు

అప్పడుండే కొండలోన (అన్నమయ్య కీర్తనకు వివరణ)

Share This
 అప్పడుండే కొండలోన (అన్నమయ్య కీర్తనకు వివరణ) 

 డా || తాడేపల్లి పతంజలి. 


 ఒక ప్రశ్నతో మొదలైన శోధన, ఇంత దూరం వెళ్ళింది అంటే, దైవానుగ్రహమే కదూ. కొన్ని రోజుల క్రితం నేను 'అప్పడుండే కొండలోన...' అనే అన్నమయ్య కీర్తనకు అర్ధం “అచ్చంగా తెలుగు” బృందంలో అడిగాను, తెలియలేదు. అదే సమయంలో గాయకులు, సాహిత్యాభిమాని, నాకు మంచి మిత్రులు అయిన శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారిని ఈ పాట గురించి అడిగాను. వారు ఇందుగురించి శ్రద్ధ వహించి, పుంభావ సరస్వతి శ్రీ తాడేపల్లి పతంజలి గారితో ఈ విషయం ప్రస్తావించడం జరిగిందట. ఇక వారు ఇచ్చిన , ఇస్తున్న వివరణ చూస్తే...  అద్భుతః! అన్నమయ్య పాటను, ఆ పాట లోని భక్తి లోతును, పొగడాలో, నా వంటి సామాన్యులకు సైతం అర్ధమయ్యే సులభ రీతిలో పతంజలి గారి చక్కటి వివరణకు దాసోహం అనాలో తెలియట్లేదు ! మొదటి భాగం మీ అందరి కోసం చదవండి... శ్రీ పతంజలి గారికి మన అందరి తరఫునా కృతజ్ఞతా పూర్వక నమస్సులు. 

 అప్పడుండే కొండలోన - 1 అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ అప్పులుగల వానివలనే ఓ వేంకటేశ 14 పొడుపు కథలతో సాగే అన్నమయ్య కీర్తనలోని పల్లవి ఇది. వివరణ:తండ్రిలాంటి వేంకటేశుడు ఉండే కొండ ఈ ప్రపంచం. దీనిపైన ఇప్పపూలవంటి మత్తు కలిగించే ఆకర్షణలకు లోను కాబోతుంటే , ఆ ఆకర్షణలు కప్పల్లాగా మారి , అందినట్లే అంది గెంతుతున్నాయి. ఇదంతా కుబేరుని దగ్గర అప్పులు తీసుకొన్నవాడి దయ. (వాడే సృష్టించి, నిలిపి, నాశనం చేస్తుంటాడు.) ఇప్పపువ్వు గురించిన విశేషాలు 1. శ్రీరామ ప్రసాదంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇప్ప పువ్వు .
 2. ప్రస్తుతం ఇప్ప పూలతో సారాయి కాచి, సంపాదిస్తుంటారు. 
3. ఇప్ప మొదలయిన వృక్షాలను ఉపవాస పూర్వకముగా దానమివ్వాలి.అలా ఇప్ప వృక్షాన్ని దానమిస్తే తీయని మాటలు వస్తాయని మత్స్య మహాపురాణము చెబుతోంది. (106-32వ శ్లోకం)
 4. బౌద్ధంలో కల్ప శబ్దాన్ని కప్ప శబ్దంతో చెబుతారు. సంవట్ట కప్ప ( ప్రపంచం అంతం కావడం), వివట్ట కప్ప - (తిరిగి ప్రపంచం సృష్టి కావడం) . 

 2.  ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే మూక మూడు విధములాయరా  ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ వివరణ:ఇక్కడ అకాశమంటే విశాలమైన లౌకిక ప్రపంచం. ఈ లౌకిక ప్రపంచంలో కా , కా (నన్ను రక్షించే వారెవరు? ఎవరు? ) అని అరిచే ఒక భక్తుడు మతాచార్యుల మూకను (= సమూహాన్ని) చూసి సమాధానం చెప్పండని కేక వేశాడు. 1. జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య మతం)చెబుతూ ఒకే కర్ర చేతిలో ధరించే అద్వైతపు మూకగా కొంతమంది మారారు. 2. జీవుడు, దేవుడు వేర్వేరు అని చెప్పే ద్వైత సిద్ధాంతపు మూకగా కొంతమంది మారారు. (రెండు కర్రలు ఒకటిగా కలిపి కట్టి) . 3. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అని (మూడు రకాల కర్రలను కలిపి కట్టి ధరించే) బోధించే మూకగా కొంతమంది మారారు. ఈ విధముగా మూక మూడు విధాలయింది. (మూక అనే శబ్దము అన్నమయ్య వాడాడు కనుక ఆ మతాచార్యులనువివరించేటప్పుడు అర్థ స్పష్టత కోసం నేను కూడా సమూహము అను అర్థము వచ్చే మూక శబ్దాన్ని వాడాను. మూక శబ్దానికి లోకంలో ఉన్న తేలిక భావం స్ఫురిస్తే నా పాపం శమించుగాక!) 

విశేషాలు1.ఒక కాకికి ఎంగిలి అన్నం మెతుకులు బగా తిని బలిసి బొంతకాకిగ అయింది. మిగిలిన కాకులు దానికి భయపడుతూ ఉండేవి.ఒకసారి హంస ఎగురుతూంటే ఈ బొంత కాకి దానితో పందెం వేసుకుంది కొంత ఎత్తు ఎగిరింది. తరువాత , ఆయాసంతో దప్పికతో హంసతో పాటు ఎగరలేక నేలమీద పడింది. కర్ణుడు కాకి వంటివాడు. అర్జునుడు హంస వంటి వాడని భీష్ముడు మహా భారతంలో ఈ కథ చెప్పాడు. 2.రామాయణంలో కిష్కింధా కాండలో సంపాతి అకాశంలోని వివిధ ఎత్తులను గురించి చెప్పాడు (58సర్గ -26,27శ్లోకాలు) - మొదటి ఎత్తులో పిచ్చుకలు, రెండో ఎత్తులో కాకులు, మూడో ఎత్తులో భాస పక్షులు, నాల్గో ఎత్తులో డేగలు, ఐదో ఎత్తులో గద్దలు, ఆరో ఎత్తులో హంసలు, ఏడో ఎత్తులో గరుడుడుఎగరగలడు. 3. చూట్టానికి అందరూ మిత్రుల్లానే ఉంటారు గాని వసంతకాలం వచ్చాక కాకీ కోకిలల భేదం తెలిసినట్టుగా మనకి ఎవరు నిజమైన మిత్రులో శత్రువులో తెలుస్తుందంటారు పెద్దలు. (వసంత కాలే సంప్రాప్తే) 3.కాకితో కూడిన కొన్ని పదబంధాలు • కాకి బంగారం =పసుపుపచ్చని అబ్రకం. • కాకిఎంగిలి= ఒకరేదైనా తినుబండారం తింటూ చిన్న పిల్లలు తమలోతాము ఇతరులకు పెట్టటానికి ఆ తినుబండారం చుట్టూ గుడ్డచుట్టి కొరికి ఇతరులకు పెట్టటం (ఎంగిలి లేదనటం ) •కాకిగోల = 1.విపరీతమైన గోల.2.• కాకులసంగమము చూచినవానికి దోషము తగులుతుందని ఒక నమ్మకం. అది పోవటానికి , వాడు చచ్చాడని బంధువులకు చెప్పి ఏదిపిస్తారు. .ఇది నిజమే అను కొని బంధువులు చేసే గోల-కాకిగోల;ఆ తరువాత నిజముచెప్పి, ఓదార్చి దోషాన్ని పోగొడతారు. • కాకి అరిస్తే చుట్టాలు వస్తారు • కాకి అరిస్తే భయపడి పక్కింటాయన్ని కౌగలించుకున్నదట • కాకి గూటిలో కోయిల పిల్లలాగా • కాకిపిల్ల కాకికి ముద్దు • కాకి ముక్కుకు దొండపండు • కాకులను కొట్టి, గ్రద్దలకు వేసినట్లు • కాకుల మధ్య కోయిల లాగా • కాకై కలకాలం మన్నేకంటే - హంసై ఆరునెలలున్నా చాలు • కాకిలా కలకాలం ఉండటం కంటే హంసలా ఆర్నెలలు జీవిస్తే చాలు! • తెల్లారితే చాలు కాకిలా ఊరంతా తిరుగుతాడు. • కాకిపిల్ల కాకికి ముద్దు (అందంగా లేడని తెలిసినా తల్లి ఏవగించుకోదు. ఈ సామెత కాకితో మాతృప్రేమని పోల్చింది.) • ఊరికే కాకిలా అరవకు. • వెధవ కాకిగోలా నువ్వూను - నోర్ముయ్యి. • కాకికేం? కారడవిలోనైనా జీవిస్తుంది. • వెధవ కాకిగూడంత ఇల్లు కట్టుకున్నాడు చచ్చీ చెడీ. (అంత అల్పంగాను, గాలొస్తే పడిపోయేలా, కాకిగుడ్డు పిల్ల కాగానే గూడుని కాకి పడగొట్టేస్తుంది కాబట్టి అతి తాత్కాలికంగా కట్టాడని భావం.) • కావు కావు (రక్షించు, తిండిపెట్టి రక్షించు) అని అరుస్తుందిట కాకి. • కాకికేం? సంస్కృత పక్షి అది (కాకః - కాకి. మిగిలిన పక్షులకి సంస్కృతంలో మరో పేరుండచ్చు గాని కాకికి అలా కాదు). • వాడు కాకి పళ్లు (కాక దంతాలు) లెక్కపెడతాడు. (కాకికి పళ్లుండవు. లేనిదాన్ని ఉన్నట్లుగా అనుమానపడే వ్యక్తిని గూర్చి...) ఇన్ని రకాలుగా మన సాహిత్యంలో కలిసిపోయిన కాకిని అన్నమయ్య ఈ పొడుపు కథలో మెరిపించాడు 

 3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే – వొల్వలెల్ల మల్లెలాయే ఓవేంకటేశ దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా వివరణ:ఎగువ అహోబిలం లో ప్రధానమయినది భవనాశిని నది. ఆకాశ గంగ భూమిపైకి ఈ తీర్థంగా వచ్చిందని చెబుతారు. భవనాశిని నదినే అన్నమయ్య ఈ చరణంలో గుంటగా పేర్కొంటున్నాడు. అహోబిలపు అయ్య అంటే -స్వామి యైన నరసింహుని భవనాశిని నదిలో -వలువలు ఉదికితే మల్లెలుగా మారుతాయని అన్నమయ్య హామీ. వలువలు శరీరాలకు ప్రతీక. వాసాంసి జీర్ణాని ... శ్లోకంలో గీతాచార్యుడు శరీరాలను వస్త్రాలతో పోల్చాడు కదా! అందువల్ల ఈ అహోబిలాన ఉన్న భవనాశిని నదిలో స్నానం చేస్తే శరీరాలు, మనస్సు పరిశుద్ధమౌతాయని ఈ చరణపు భావం. . పరిశుద్ధతకు ప్రతీకగా తెలుపురంగులో ఉన్న మల్లెలను అన్నమయ్య ఈ పొడుపు కథలో పేర్కొన్నాడు. 

విశేషాలు 1.గరుత్మంతుడు నరసింహ స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం అన్నాడట.అందుకని ఆ రోజునుంచి ఈ ప్రదేశానికి అహోబిలం అని పేరు వచ్చింది. 2.ఇంద్రుడు మొదలైన దేవతలు “ अहोवीर्यं अहोशौर्यं अहोबाहुपराक्रमं नारसिंहं परं दैवम् अहोबिलं अहोबलं !! అహోవీర్యం, అహోశౌర్యం, అహోబలం, నారసింహం పరందైవం అహోబిలం, అహో బలం అన్నారని(అహో ! ఏమి శక్తి.! అహో ! ఏమి పరాక్రమము ! అహో ! ఏమి బలం ! నరసింహుడే గొప్ప దేవుడు. అహో ! ఏమి బలమతనిది ! అతనుండే ఈ గుహ ఎంత గొప్పది ! ) అందువలన ఈ క్షేత్రం అహో బిలం అయిందని ఇంకొక కథ. 3.అయ్య అంటే పూజ్యుడని ఒక అర్థం. "అద్దిరా అయ్యకు మన్మథాభ్యుదయము." అని కళాపూర్ణోదయ ప్రయోగము. నాన్న, అయ్య, బాపు [కళింగ మాండలికం]అన్నాజీ, నాయ్న, బాపు, అయ్య, దాద, బప్ప, పప్ప, నాయన, బాబ [తెలంగాణ మాండలికం] అప్ప, అయ్య, నాన్న [రాయలసీమ మాండలికం]- అయ్య శబ్దాన్ని అహోబిలానికి చేర్చి, కొత్త పదాన్ని సృష్టించిన అన్నమయ్య నిరంకుశుడు. దాసోహమయ్యా ! అనకుండా ఉండలేం. 

4. నల్లమల పర్వతసానువుల్లో అహోబిలం పుణ్యక్షేత్రంలో భవనాశిని నది జన్మించింది. అక్కడి నుంచి అనేక మండలాల గుండా తూర్పు నుంచి పడమర కు ప్రవహిస్తూ.. ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల మీదుగా సప్తనదీ సంగమక్షేత్రంలో కలుస్తోంది.(భవనాశిని నదికి సంబంధించిన చిత్రాన్ని అనుబంధంగా చూడవచ్చు.) 4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా వివరణ:అహోబిలంలో విష్ణువు నరసింహస్వామి అనే కల్ప వృక్షంగా ఆవిర్భవించాడు. భూమండలమంతా ఆ నరసింహావతారము రక రకాల పేర్లతో విస్తరించింది. (తీగవలె) - కంచిలో వరద రాజ స్వామి పేరుతో , ఆవిష్ణువు శుభ ఫలితాలను ఇచ్చాడు. శ్రీరంగంలో విష్ణువు పడుకొని ఉన్న రూపంతో అవతరించి భక్తుల కోర్కెలను పండిస్తున్నాడు. విశేషాలు • అష్టముఖ నరసింహ, అఘోర నరసింహలాంటి 72 రకాల నరసింహుని రూపాలున్నాయి. • వైశాఖ శుక్ల చతుర్థశి స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో నరసింహ స్వామి ఉద్భవించాడు. • మన రాష్ట్రంలో నరసింహుని ఆలయాలు చాలా ఉన్నాయి. మృగరాజులకి గృహాలు గుహలేకనుక శ్రీనరసింహుని దేవాలయాలు కొండల మీదే ఉన్నాయి. ఉదా. యాదగిరి,సింహచలం,మంగళగిరి • కంచిలో వరదరాజస్వామి దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు • వర్ద రాజ స్వామి ఆలయంలోనే వరదయ్యకు క్షేత్రయ్య (అనేక క్షేత్రాలు తిరిగేవాడు) అను పేరు వచ్చిందని చెబుతారు. పూజారులు ఈ పేరు వరదయ్యకు ప్రసాదించారట. • స్వామి శ్రీరంగంలో పడుకొని ఉన్న దృశ్యాన్ని రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలో చెప్పారు. స్వామి పడుకొని ఉంటే, వక్షస్థలంపై కౌస్తుభం మెరుస్తూ ఉంటుంది. (స్ఫటల మణుల్ గ్రాల) 5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా పుట్టామీద చెట్టు బుట్టే  విష్ణు మూర్తి వేంకటేశునిగా మారి లక్ష్మీ దేవినివెతు క్కొంటూ ఏడుకొండలు చేరాడు. పుట్టలో నిలిచిన వేంకటేశ్వర స్వామికి ఆకలి తీర్చాలని బ్రహ్మ శివులు ఇద్దరు ఆవు దూడలుగా మారారు. పాలు పుట్టపాలు అవుతున్నాయని గొల్లవాడు వేంకటేశుడిని గాయపరిచాడు.వేంకటేశుడిని చెట్టుగా , కోరిన వరాలిచ్చే కల్ప వృక్షంగా అన్నమయ్య ఈ పాదంలో చెప్పాడు. భూమియెల్ల తీగపారే ఆ కల్ప వృక్షమైన స్వామి యొక్క మహిమ సకలలోకాలలో వ్యాపించింది. పర్వతాన పండు పండేరా తను చేసిన అపచారానికి హడలిపోయి ప్రాణాలు విడిచిన ఆ గొల్ల సంతతివాళ్లకు ఈ నాటికి తొలిదర్శన భాగ్యం ప్రసాదించాడు వేంకటేశుడు. ఇది ఆ గొల్ల వంశపు అదృష్టమే కదా ! వాళ్ల అదృష్ట ఫలము పర్వతము మీద- ఆ సప్త గిరుల మీద పండింది. అందవచ్చు కోయరాదురా తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. వేంకటేశుని భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమలలో మందిర నిర్మాణము చేయించాడు. . . తొండమానుడు నిత్యము స్వామితో సంభాషించేవాడు. ఒకరోజు ఆకాశవాణి తొండమానుడంతటి భక్తుడు లేడని చెప్పింది. . తొండమానుడు తనవంటి భక్తుడు ఇంకొకడు లేడనుకొన్నాడు . ఆ మాటే ఒకరోజు తొండమానుడు స్వామితో చెప్పాడు. స్వామి తొండమానునికి బుద్ధి చెప్పాలనుకొన్నాడు. ఆ మరుసటి రోజు తొండమానుడు పూజించినబంగారు కమలాలతో పాటు మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. ఆ మట్టి అంటుకొన్న కమలాలగురించి స్వామిని తొండమానుడు ప్రశ్నించాడు. తన కఱ్ఱబొమ్మగా మలచి భీముడు అనే కుమ్మరి భక్తుడు నిష్కల్మషంగాపూజిస్తున్నాడని స్వామి చెప్పాడు. ! తొండమానుడు భీముని దర్శించుకొన్నాడు. ఆ భీముని సన్నిధిలో లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై వారికి మోక్షం ఇవ్వటం చూసాడు. ఈ వేంకటేశుని మహిమా ఫలాన్ని నిష్కల్మషంగా అర్చించి అందరూ పొందవచ్చు. కాని తొండమాను చక్రవర్తిలా వేంకటేశ ఫలాన్ని అహంకారంతో అందుబాటులో ఉంచుకొందామంటే దక్కడు (భవిష్యోత్తర పురాణము) (వచ్చే నెల ... మిగతా భాగం )  

No comments:

Post a Comment

Pages